Begin typing your search above and press return to search.

స‌ర్జిజ‌ల్ సైక్లాజిక‌ల్ గేమ్.. సోము ఏదేదో మాట్లాడుతున్నారా?

By:  Tupaki Desk   |   18 Sep 2022 8:30 AM GMT
స‌ర్జిజ‌ల్ సైక్లాజిక‌ల్ గేమ్.. సోము ఏదేదో మాట్లాడుతున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ .. టీడీపీ డ్రామా పార్టీలుగా మారాయని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, టీడీపీ ఇప్పటి వరకు ఎనిమిదేళ్లు ఏపీని పాలించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాయని హాట్ కామెంట్స్ చేశారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో దిశ, దశ లేని రాజకీయాలు చేస్తున్నాయ‌ని నిప్పులు చెరిగారు.

రాజధాని కోసం రైతులను రోడ్డెక్కిస్తారా అంటూ సోము వీర్రాజు నిల‌దీశారు. రాష్ట్రంలో పార్టీల మ‌ధ్య‌ సైక్లాజికల్ గేమ్ నడుస్తోందన్నారు. బీజేపీ కూడా ఏపీలో స‌ర్జిక‌ల్ సైక్లాజిక‌ల్ గేమ్ ప్రారంభించిద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఏపీలో సంచ‌ల‌న ప‌రిణామాలు ఖాయ‌మ‌న్నారు.

2024లో ఏపీలో బీజేపీ అధికారం దక్కించుకోవటం లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న స‌హాయం ద్వారా ఏపీలో 2.75 కోట్ల మందికి బీజేపీ ప్ర‌భుత్వంలో నేరుగా సంబంధాలు ఏర్ప‌డ్డాయ‌న్నారు. రాష్ట్రంలో 5 వేల స‌భ‌లు ఏర్పాటు చేసి బీజేపీ ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రిస్తామ‌న్నారు. బీజేపీ మిన‌హాయించి మ‌రే పార్టీకి ప్ర‌జ‌ల‌తో నేరుగా ఇంత‌టి స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డ‌లేద‌న్నారు. అందుకే ఆయా పార్టీలు త‌మ‌తో పొత్తు పెట్టుకోవ‌డానికి మొగ్గుచూపుతున్నార‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే టీడీపీ, వైసీపీ క‌నుమ‌రుగు అవుతాయ‌న్నారు.

మూడు రాజధానుల వివాదం పైన సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజధాని అనేది సైలెంట్ ఫ్యూచర్ అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. మూడు రాజధానులు అంటే బే పార్క్, వాల్తేర్ క్లబ్ కాదని వ్యాఖ్యానించారు. 7 వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని ఏమైందని టీడీపీ, వైసీపీల‌ను ప్ర‌శ్నించారు.

ఏపీలో రూలింగ్ కంటే ట్రేడింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. విశాఖ‌ప‌ట్నం నుంచి బీజేపీ పోరు యాత్ర‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు సోము వీర్రాజు తెలిపారు.

కాగా సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌పై విశ్లేషకులు, నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. బీజేపీకి ఏపీ లో అంత సీన్ లేద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఏపీ కాంగ్రెస్ అంత‌ర్థాన‌మైంద‌ని.. త్వ‌ర‌లో బీజేపీకి కూడా ఇదే గ‌తి ప‌డుతోంద‌ని చెబుతున్నారు. ఒక‌టి రెండు పార్ల‌మెంటు సీట్ల కోసం, ఏడెనిమిది అసెంబ్లీ సీట్ల కోసం వేరే పార్టీల‌తో పొత్తుల కోసం అర్రులు చాస్తోంది బీజేపీయేన‌ని మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా సోము వీర్రాజు ప‌గ‌టి క‌ల‌లు క‌న‌డం మానుకోవాల‌ని సూచిస్తున్నారు.