Begin typing your search above and press return to search.

వైసీపీ టీడీపీలు కుటుంబ పార్టీలు అయితే జనసేన... ?

By:  Tupaki Desk   |   8 May 2022 1:30 PM GMT
వైసీపీ టీడీపీలు కుటుంబ పార్టీలు అయితే జనసేన... ?
X
బీజేపీ తేడా గల పార్టీ అని చెప్పుకుంటుంది. అలాగే తమకు తరతమ భేదాలు లేవు అని కూడా చాటుకుంటుంది. తాము అందరినీ సమదృష్టితో చూసామని చెబుతుంది. ఇక సిద్ధాంతాల విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తి అసలు లేదని కూడా బీజేపీ నేతలు గట్టిగానే చెబుతారు. అలాంటి పార్టీ జాతీయ విధానం ఏంటి అంటే కుటుంబ పార్టీలకు పక్కా వ్యతిరేకం. అలాగే వారసత్వ పార్టీలు, అవినీతి పార్టీలకు వ్యతిరేకం. ఈ విషయం మోడీ అనేక సందర్భాల్లో పార్టీ వేదిక మీద చెప్పుకొచ్చారు.

దేశంలో అతి పెద్ద కుటుంబ పార్టీ కాంగ్రెస్ అని కూడా ఆయన తరచుగా దుయ్యబెడుతూంటారు. మరి కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ తన అధికార రాజకీయలకు అనుకూలంగా అనేక సందర్భాల్లో ఆయన కుటుంబ పార్టీలతోనే చెట్టాపట్టాలు వేసుకుంది. అలాగే కుటుంబ పార్టీల మద్దతుతోనే వాజ్ పేయ్ రెండు సార్లు ప్రధాని కూడా అయ్యారు.

ఇపుడు అయితే మోడీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేదు కాబట్టి మళ్లీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకం అంటూ గట్టిగా గళం విప్పుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ 2024లో కనుక మోడీ సర్కార్ కి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోతే అపుడేం చేస్తారు అన్నదే ప్రశ్న. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు చెబుతున్నట్లుగా తాము కుటుంబ పార్టీలకు వ్యతిరేకం కాబట్టి అని అధికారం కోసం ప్రయత్నం చేయకుండా వారి మద్దతు తీసుకుండా తప్పుకుంటారా. మడి కట్తుకుని కూర్చుంటారా అన్నది పెద్ద ప్రశ్న కమలనాధులకే వేస్తున్నారు అంతా.

ఇక ఏపీలో వైసీపీ టీడీపీ రెండూ కూడా కుటుంబ పార్టీలు అని సోము వీర్రాజు తేల్చేశారు. మరి అది ఎలాగో ఆయన చెప్పలేదు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీలో జగన్ తప్ప ఆయన కుటుంబం నుంచి ఎవరూ పార్టీ పదవుల్లో కానీ ప్రభుత్వంలో కానీ లేరు. అయినా సరే జగన్ ది కుటుంబ పార్టీ అయిపోయింది. ఇక టీడీపీ విషయం తీసుకుంటే చంద్రబాబు ఆయన కుమారుడు ఇద్దరూ పార్టీలో ఉన్నారు.

అలాగే ప్రభుత్వంలో ఉన్నపుడు వారిద్దరూ పనిచేశారు. కాబట్టి కుటుంబ పార్టీ అని సోము వీర్రాజు విమర్శిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే జనసేన కుటుంబ పార్టీ కేటగిరీలోకి వస్తుందా లేదా అన్నది సోము వీర్రాజు చెప్పాలి. తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చుకుని వారిని రాజకీయంగా ప్రమోట్ చేస్తే కుటుంబ పార్టీలు అని బీజేపీ ముద్ర వేస్తుంది. ఆ లెక్కన నాగబాబుకు నర్సాపురం లోక్ సభ టికెట్ ఇచ్చారు. ఇపుడు జనసేనలో ఆయన కీలకనాయకుడిగా ఉన్నారు.

మరి చంద్రబాబు ఆయన కొడుకు టీడీపీలో ఉంటే వారిది కుటుంబ పార్టీ అని విమర్శలు చేస్తున్న సోము వీర్రాజు వైఎస్సార్ కాంగ్రెస్ ని కుటుంబ పార్టీ అని నిందిస్తున్న పెద్దలు జనసేనను ఏ రకంగా ట్రీట్ చేస్తారు అన్నది ఇక్కడ చర్చగా చూడాలి. అంతే కాదు దేశానికి ప్రాంతీయ పార్టీల వల్ల ఇబ్బంది అని కూడా బీజేపీ భావిస్తుంది అంటారు. పలు సందర్భాలలో జాతీయ భావాలతో కూడిన అసలైన జాతీయ పార్టీ తమదని గొప్పగా చెప్పుకుంటుంది కదా మరి ఏపీలో జనసేన ప్రాంతీయ పార్టీయే కదా. మరి ఆ పార్టీతో పొత్తు తీపిగా ఎలా ఉంటుంది సోమన్నా అంటే ఎలా జవాబు చెబుతారో.

మొత్తానికి చూస్తే ఎవరైనా సిద్ధాంతాలు చెప్పడానికి ఎపుడూ బాగుంటాయి. అదే సమయంలో వాటిని తమకు అనుగుణంగా మార్చుకోవడంలోనే రాజకీయ నేతలు సిద్ధ హస్తులు అని చెప్పాలి. బీజేపీ తేడా గల పార్టీ అని చెప్పుకుంటూనే ఇలా మాట్లాడడం పట్ల కూడా చర్చ ఎపుడూ సాగుతూనే ఉంటుంది.