Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప‌త‌నం ప్రారంభ‌మైంది.. సోము వీర్రాజు ఫైర్‌.. రీజ‌న్ ఏంటంటే!

By:  Tupaki Desk   |   28 April 2022 3:30 PM GMT
కేసీఆర్ ప‌త‌నం ప్రారంభ‌మైంది.. సోము వీర్రాజు ఫైర్‌.. రీజ‌న్ ఏంటంటే!
X
త‌న‌కు సంబంధం లేని, త‌న రాష్ట్రం కూడా కాని.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై ఏపీ బీజేపీ చీఫ్‌.. సోము వీర్రాజు నోరు చేసుకున్నారు. తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. కేసీఆర్ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని అన్నారు. అంతేకాదు.. మ‌రెన్నో మాటలు అనేశారు. మ‌రి దీనికి కార‌ణం.. ఏంటి? ఎందుకు? అంటే.. బుధ‌వారం జ‌రిగిన ముఖ్య మంత్రుల‌తో ప్ర‌ధాని మోడీ మీటింగే కార‌ణం!!

ఆశ్చ‌ర్యంగా ఉన్నా నిజం. ఆ స‌మావేశంలో పెట్రోల్ ధ‌ర‌ల‌ను కెలికిన ప్ర‌ధాని మోడీ.. మీరు ఎందుకు త‌గ్గించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. సమాఖ్య స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని.. త‌గ్గించాల‌ని.. ఉచిత స‌ల‌హా ప‌డేశారు. దీనిపై దేశ‌వ్యాప్తంగా ఉన్న బీజేపీయేత‌ర‌(ఏపీ మిన‌హా) ముఖ్య‌మంత్రులు సీరియ‌స్ అయ్యారు. మోడీపై దుమ్మెత్తి పోశారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానిని తిట్టిపోశారు. కేంద్రం ధరలు ఎందుకు పెంచుతోందని ప్రశ్నించారు.

అయితే..కేసీఆర్‌.. ప్ర‌ధానిపై చేసిన విమ‌ర్శ‌ల‌కు.. అటు తెలంగాణ బీజేపీ నాయ‌కుల మాటేమో.. కానీ.. ఏపీ నుంచి సోము వీర్రాజు ఖ‌స్సున లేచారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని.. విమ‌ర్శించారు. గురువా రం రాజమండ్రిలో జ‌రిగిన బీజేపీ గోదావరి జోనల్ సమావేశంలో వీర్రాజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వా లపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరలు తగ్గాంచాలని ప్రధాని కోరితే కేసీఆర్ కావు కేక ఏంటి ? ఇలాంటి కావు కేకలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

పెట్రోలు, డీజిల్ దిగుమతులకు రూ. 20 లక్షలు కోట్లు అవసరం ఉంటుందని.. కేంద్రం అంత భారం మోస్తూ.. కూడా స‌బ్సిడీపై స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని.. అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని, ఉభయ ప్రాంతీయ అధికార పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమ‌రావ‌తి ఉద్య‌మం అందుకే..

ఏపీ రాజ‌ధానికి కేంద్రం రూ.7,200 కోట్లు ఖర్చు చేసింద‌ని సోము అన‌న్నారు.. అయితే.. అక్కడ ఎలాంటి నిర్మాణాలు క‌నిపించ‌లేద‌ని.. అందుకే రైతులు ఉద్య‌మ బాట‌ప‌ట్టార‌ని అన్నారు. ``ఒక పార్టీ మాట్లాడదు మరో పార్టీ మాట మారుస్తోంది. రాజధానిని వివాదం చేసిన పరిస్థితులు దేశంలో ఎక్కడా లేదు.. గతంలో రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా సమస్యలు లేవు. కుటుంబ వారసత్వ ఆలోచన ఉన్న పార్టీల వల్లే రాజదాని సమస్య వ‌చ్చింది`` అని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు తీసుకుని వెళ్లాలని ప్రధాని భావిస్తున్నట్లు వెల్లడించారు. అందువల్లే ఇరిగేషన్ మంత్రి గజేంద్ర షెఖావత్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తరువాత సమీక్షలు పెంచార‌ని అన్నారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కుటుంబ పార్టీల ప్రభుత్వాలు కారణమన్నారు. ఏపీ సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమం, మొత్తం అప్పలు మయమని, మొత్తంగా రాష్ట్రం అవినీతి మయంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి ఉందని సోము వీర్రాజు హెచ్చరించారు.