Begin typing your search above and press return to search.

సోము లేకుండా బీజేపీ మీటింగ్... ఏం జరుగుతోందసలు...?

By:  Tupaki Desk   |   28 March 2022 1:30 PM GMT
సోము లేకుండా బీజేపీ మీటింగ్... ఏం జరుగుతోందసలు...?
X
ఏపీ బీజేపీకి సోము వీర్రాజు ప్రెసిడెంట్ అయి కొద్ది నెలలలో రెండేళ్ళు పూర్తి కావస్తుంది. సోము వీర్రాజు తన వంతుగా బాగా చేశాను అనుకుంటున్నారు. అయితే ఆయన మీద వ్యతిరేకత ఉందని కమలం పార్టీలో మరో వైపు ప్రచారం సాగుతోంది. దానికి బలం చేకూరేలా సోము వీర్రాజు లేకుండా మీటింగ్ పెట్టడం జరిగింది. మరి దీని మీదనే ఇపుడు ఆ పార్టీ లోపలా బయటా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అసలు ఏం జరుగుతోంది. తెర వెనక ఎవరున్నారు. సోము వీర్రాజు ఎందుకు హాజరు కాలేదు ఇవన్నీ ప్రశ్నలే. దీనికి ఎవరికి తోచిన జవాబులు వారికి ఉన్నాయి. సోముని తప్పించేందుకే ఆయన వ్యతిరేకులు అంతా ఒక్కటి అయ్యారు అని కూడా అంటున్నారు. అలాంటిది ఏమీ లేదని అంటున్నా హాజరైన వారి జాబితా చూసుకున్నా బీజేపీని ఏపీలో పటిష్టం చేయాలంటూ నేతలు మాట్లాడుతున్న విధానం చూసినా ఏపీ బీజేపీలో ఏదో జరుగుతోంది అని మాత్రం అనిపిస్తుంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ కు అభినందనలు పేరిట ఆత్మీయ సమావేశం అంటూ దాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ అద్వర్యంలో జరిగింది. దీనికి బీజేపీ మాజీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణతో పాటు, దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ , పాతూరి నాగభూషణం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రమేష్ నాయుడు , ఎస్ కె బాజీ , శ్రీనివాస రాజు వంటి ముఖ్యనేతలు హాజరయ్యారు.

వీరందరూ యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించినందుకు సత్యకుమార్ ని ప్రశంసించారు. ఈ సందర్భంగా అనేక విషయాలు కూడా ప్రస్థావనకు వచ్చాయని అంటున్నారు. ఇక మీదట ఏపీ రాజకీయాల మీద సత్యకుమార్ దృష్టి సారించాలని కూడా నేతలు కోరారు.

అదే టైం లో ఈ సమావేశంలో కనీసం సోము వీర్రాజు గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు అని అంటున్నారు. అలాగే ఆయన వర్గీయులుగా పేరు పొందిన వారికి కూడా ఈ సమావేశం వివరాలు తెలియనివ్వలేదని అంటున్నారు.

ఇక ఈ సమావేశంలో పాలుపంచుకున్న వారు వైసీపీ వ్యతిరేక వర్గీయులు అంటున్నారు. అంటే బీజేపీలో వీరిదో వర్గంగా ఉంది అంటున్నారు. ఇక ఇదే బీజేపీలో వైసీపీ అనుకూలురు, వ్యతిరేకులు ఉన్నారని కూడా అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళూ ముసుగులో గుద్దులాటగా సాగిన ఈ పోరు ఇపుడు బయటకు వచ్చిందని చెబుతున్నారు.

ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలంటే యాంటీ వైసీపీ స్టాండ్ గట్టిగా తీసుకోవాలని కూడా అంటున్నారు. మరి ఈ సమావేశం బట్టి చూస్తే రానున్న కాలంలో అనేక కేలక పరిణామాలు బీజేపీ లో సంస్థాగతంగా జరుగూఅయని అంటున్నారు. చూడాలి మరి దీని మీద బీజేపీలో తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో.