Begin typing your search above and press return to search.

సందేహం అక్కర్లేదు.. కూరలో కరివేపాకుగా పవన్ మారిపోయినట్లే

By:  Tupaki Desk   |   13 Dec 2020 3:15 AM GMT
సందేహం అక్కర్లేదు.. కూరలో కరివేపాకుగా పవన్ మారిపోయినట్లే
X
కొందరు నేతలు మాటలు పడటానికే పుట్టినట్లుగా ఉంటారు. ఆ అధినేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అధినేత మాటలు అనటానికే పుడతాడు. తెలుగు ప్రజలకు ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ జాబితాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారాన్ని తీసుకుంటే.. ఆయన జనాలు వాడుకోవటానికే పుట్టారా? అన్న భావన కలుగక మానదు. మొదట్లో చంద్రబాబుకు.. మధ్యలో కమ్యునిస్టులకు.. గడిచిన కొంతకాలంగా బీజేపీకి ఆయన పులుసులో ములక్కాయలా మారారని చెప్పాలి.

ఎప్పటికప్పుడు.. ఎవరో ఒకరు వాడేయటానికే తాను ఉన్నట్లుగా పవన్ వ్యవహారం ఉంటుందని చెప్పాలి. మొన్నటికి మొన్న హైదరాబాద్ మహానగరానికి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 50 డివిజన్లలో పోటీ చేయాలని పవన్ భావించారు. అందుకు తగ్గట్లే అధికారిక ప్రకటన జారీ చేశారు. తాము పోటీ చేయని చోట బీజేపీ అభ్యర్థులకు దన్నుగా ఉంటామని చెప్పారు. బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.

పోటీకి సిద్ధమైన పవన్ వెనక్కి తగ్గారు. సాంకేతిక కారణాల మాట చెప్పి పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. దీంతో.. బీజేపీ ఎంత లబ్థి పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తర్వాత ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడ్ని కలిసిన పవన్.. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని.. బీజేపీ మద్దతు ఇవ్వాలని రిక్వెస్టు చేసినట్లుగా పార్టీ వర్గాలు చెప్పాయి.

ఒకవేళ.. అదే నిజమైతే.. రాజకీయాలకు పవన్ పనికి వస్తారన్న మాట వినిపించింది తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటల తీరు చూస్తే.. పవన్ కు బీజేపీ మరోసారి హ్యాండిచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికల బరిలో తాము నిలుచుంటామన్న సంకేతాన్ని ఆయన ఇచ్చేశారు. అంతేకాదు.. జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ వ్యాఖ్యానించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

జనసేన ఏదో తమ సొంత సొత్తు అన్నట్లుగా.. వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ స్థానంలో బీజేపీతో పోలిస్తే జనసేనకే ఎక్కువ బలం ఉందన్నది వాస్తవం. అలాంటప్పుడు మిత్ర ధర్మాన్ని అనుసరించి జనసేన అభ్యర్థికి బీజేపీ తన మద్దతును ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు.. తాము బరిలోకి దిగుతామని చెప్పిన తీరు చూస్తే.. పవన్ ను కమలనాథులు కూరలో కరివేపాకులా వాడేయటానికి.. పులుసులో ములక్కాయలా నంజుకు తినటానికి మాత్రమే ఆయన ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. సోము ప్రకటనపై పవన్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.