Begin typing your search above and press return to search.

'సామాన్య' ఎమ్మెల్యేలు మరీ ఇంత ముదురు కేసులా?

By:  Tupaki Desk   |   12 Jun 2015 4:20 AM GMT
సామాన్య ఎమ్మెల్యేలు మరీ ఇంత ముదురు కేసులా?
X
నిత్యం నీతులు చెప్పే ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన నేతల అసలు రంగు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సంప్రదాయ రాజకీయ పార్టీ నేతల్ని తలపించేలా ఆమ్‌ఆద్మీ నేతల లీలలు ఉండటం తెలిసిందే. ఢిల్లీ రాష్ట్ర న్యాయశాఖామంత్రిగా వ్యవహరించిన జితేంద్రసింగ్‌ తోమర్‌.. నకిలీ డిగ్రీ పత్రాలతో నామినేషన్‌ దాఖలు చేసి దొరికిపోవటం తెలిసిందే. నకిలీ న్యాయవాద డిగ్రీని జత చేర్చిన అంశంపై ప్రాధమిక ఆధారాలతో అతన్ని అరెస్ట్‌ చేయటం తెలిసిందే.

మరోవైపు ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్‌ భారతిపై ఆయన భార్య చేస్తున్న ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. తనను ఎంత దారుణంగా ఈ నేత హింసించింది చెప్పుకొని విలపిస్తున్నారు. గత కొద్దికాలంగా భర్తకు వేరుగా ఉంటున్న ఆమె.. తన భర్త గురించి చెబుతూ.. తాను ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తనపై కుక్కల్ని ఊసిగొల్పాడని ఆరోపించారు. మూడోసారి గర్భం దాల్చిన సమయంలో బలవంతంగా గర్భస్రావం చేయించారని ఆరోపించారు.

భర్త పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఒకసారి తన చేతి మణికట్టును కోసుకునే ప్రయత్నం చేశానని చెప్పిన ఆమె.. తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించారు. భర్త సోమనాథ్‌ మీద భార్య లిపిక చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను జూన్‌ 26న తమ ముందు హాజరు కావాలంటూ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు వివాదాలు ఇలా ఉంటే మరోవైపు.. సెంట్రల్‌ కరోల్‌బాగ్‌ ఎమ్మెల్యే విశేష్‌రవి విద్యార్హత మీద కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విద్యార్హతలు తప్పుగా ఉన్నాయంటూ ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన మాజీ నేత రాజేష్‌గార్గ్‌ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీతిమంతుల పార్టీగా చెప్పుకునే కేజ్రీవాల్‌.. ఇలాంటి ఆరోపణలు.. ఇలాంటి వ్యవహారాలపై ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.