Begin typing your search above and press return to search.

సోమిరెడ్డీ.. మీకు మంత్రి పదవి ఇచ్చినట్టేనబ్బా!

By:  Tupaki Desk   |   6 Sept 2016 10:59 AM IST
సోమిరెడ్డీ.. మీకు మంత్రి పదవి ఇచ్చినట్టేనబ్బా!
X
చంద్రబాబునాయుడు ఏ లగ్నంలో మంత్రి వర్గ పునర్‌ వ్యవస్తీకరణ అనే పదం ప్రకటించారో గానీ.. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీలో ఆశావహుల జోరును తట్టుకోవడం చాలా కష్టమైపోతోంది. తెదేపాలో మంత్రి పదవుల్ని ఆశిస్తున్న నాయకుల్లో ఇప్పుడు రెండు రకాలు ఉన్నారు. ఒకరు.. రకరకాల సమీకరణాల నేపథ్యంలో తమకు పదవి గ్యారంటీ అనుకుని, మౌనంగా కూర్చుని ఉన్న వారైతే... రెండో కేటగిరీలో.. ఏమో ఖర్మగాలి చివరినిమిషంలో చంద్రబాబు మనల్ని పక్కన పెడతాడేమో.. అని భయపడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ రెండో కేటగిరీ నాయకులను తట్టుకోవడం చాలా కష్టమైపోతోంది.

వారు చీటికి మాటికి ప్రెస్‌ మీట్‌ లు పెట్టి జగన్మోహనరెడ్డి తిట్టిపోయడం మీదనే తమ దృష్టి మొత్తం కేంద్రీకరిస్తున్నారు. ఆ కేటగిరీలోకే నెల్లూరుకు చెందిన సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కూడా వస్తున్నారు. జనం ఓట్లతో గెలవలేకపోయినా.. ఎమ్మెల్సీ దక్కింది గనుక.. మంత్రి పదవి ఆశిస్తున్న సోమిరెడ్డి.. ఎడాపెడా జగన్‌ మీద విమర్శలతో విరుచుకుపడుతుండడం విశేషం. పార్టీలోని ఓ సీనియర్‌ నాయకుడి వద్ద ఈ విషయమే చర్చకు వచ్చినప్పుడు.. 'ఆయనకు మంత్రి పదవి ఇస్తారులేబ్బా.. కాస్త శాంతంగా ఉండమని చెప్పండీ..' అంటూ సెటైర్లు వేసినట్లుగా నాయకులు చెప్పుకుంటున్నారు.

పాపం తెలుగుదేశంలోనే మూడో కేటగిరీ కూడా ఒకటి కనిపిస్తోంది. వారు మంత్రి పదవిని పోగొట్టుకునే ప్రమాదంలో ఉన్న వారిగా చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. తన పదవిని కాపాడుకునేలా సీఎంను ఇంప్రెస్‌ చేయడానికి మళ్లీ జగన్‌ ను తిట్టడం అనే బాటలోకే తానుకూడా వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకూ వీళ్ల కష్టాలను ముఖ్యమంత్రి గమనిస్తారా? ఆయన వద్ద గానీ, లోకేష్‌ బాబు వద్దగానీ.. ఇప్పటికే జాబితా సిద్ధంగా లేకుండా ఉంటుందా అని కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.