Begin typing your search above and press return to search.

బీఆర్‌ఎస్‌లో చేరనున్న సోమేశ్‌కుమార్?

By:  Tupaki Desk   |   25 April 2023 10:10 AM GMT
బీఆర్‌ఎస్‌లో చేరనున్న సోమేశ్‌కుమార్?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ అంత ఈజీగా ఎవరిని నమ్మడు అన్న పేరుంది. నమ్మితే వదిలి పెట్టడు అన్న ప్రచారం ఉంది. అయితే నమ్ముకున్నోళ్లు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా న్యాయం చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు అన్న పేరుంది. అదే చాలా సార్లు నిజమైంది. తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు సలహాదారుల పదవులు ఇచ్చి తన పక్కనే కూర్చుండబెట్టుకున్న ఘనత కేసీఆర్ సొంతం. ఇక తాజా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ కు కూడా పునరావాసం కల్పించేందుకు రెడీ అవుతున్నారు.

సర్వీస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దాదాపు రెండు నెలల తర్వాత రాజకీయాల్లోకి రావాలని యోచిస్తున్నారు. తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరుగుతున్న బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో కలిసి సోమేశ్‌ వేదిక పై కనిపించి పలువురిని ఆశ్చర్యపరిచాడు.

కొన్ని కీలక మైన అంశాల్లో ప్రభుత్వ సలహాదారుగా కేసీఆర్ తన సేవలను వినియోగించుకోవచ్చని మొన్నటి వరకు చర్చ సాగింది. అయితే సోమేష్ కుమార్ రాజకీయ వేదికపై కనిపించడంతో అతను క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అధికారికంగా బీఆర్ఎస్ లో చేరవచ్చు అనే ఊహాగానాలకు తెరతీసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్వీసు నుండి స్వచ్ఛంద పదవీ విరమణ కోసం సోమేష్ కుమార్ చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదించారు. అప్పటి నుండి సోమేష్ సైలెంట్ గా ఉన్నారు.

1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ తనకు తెలంగాణ కేడర్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో 2023 జనవరి 12న విధులకు హాజరైన వెంటనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి తన అభ్యర్థనను సమర్పించారు. వెంటనే రిలీవ్ చేయాలని, రెండు రోజుల్లోగా ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. ఏపీ ప్రభుత్వానికి నివేదించిన ఒక నెల తర్వాత, సోమేష్ కుమార్ వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయగా వెంటనే అదే మంజూరు చేయబడింది.

సుదీర్ఘ మైన , పెద్ద హోదాల్లో పనిచేసిన సోమేష్ కుమార్ తన క్రెడిట్‌ తో అనేక విజయాలు సాధించాడు. అయితే సోమేష్ అధికార పార్టీలకు సహకరిస్తూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.ముఖ్యంగా ధరణిని తెచ్చి రైతుల పాలిట విలన్ గా మారాడన్న విమర్శలున్నాయి. భూమి రికార్డులను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన ధరణి పోర్టల్ అతనికి క్రెడిట్ ను విమర్శలను రెండు విధాలుగా తెచ్చిపెట్టింది.

రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని ఆర్జించడంలో అతని సామర్థ్యం , నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సోమేశ్ కుమార్‌కు ప్రధాన సలహాదారుగా పదవిని ఇవ్వవచ్చని నివేదికలు చెప్పాయి. తాజాగా బీఆర్ఎస్ మీటింగ్ లో కనిపించడంతో ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది.