Begin typing your search above and press return to search.

హైకోర్టు ముందుకు తెలంగాణను నడిపించే కీలక అధికారి!

By:  Tupaki Desk   |   29 Dec 2020 3:45 AM GMT
హైకోర్టు ముందుకు తెలంగాణను నడిపించే కీలక అధికారి!
X
తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తాజాగా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ఒక భూవివాదం కేసులో ఆయన స్వయంగా హాజరు కావాల్సి వచ్చింది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా హైకోర్టు ఎదుట హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కాసింత అసహనాన్ని వ్యక్తం చేసింది.

ఎందుకంటే.. సదరు కేసుకు సంబంధించిన తాము ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో సోమేశ్ రెవెన్యూ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. అదే ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయినప్పటికి హైకోర్టు ఆదేశాల్ని అమలు కాకపోవటంపై కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా తనకు ఆర్నెల్లు సమయం ఇస్తే.. హైకోర్టు ఆదేశాల్ని అమలు చేస్తామని చెప్పగా.. కోర్టు నిరాకరించింది. ఆరు వారాల సమయాన్ని మాత్రమే ఇచ్చి.. అమలు చేయమని స్పష్టం చేసింది.

ఇంతకూ ఇదంతా ఏ కేసు విషయంలో చోటు చేసుకున్నదంటే.. షేక్ పేట మండలంలోని సర్వే నెంబర్లు 20, 21, 25లకు సంబంధించి 59.18 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని.. ఈ భూమి యజమానుల వారసులకు సంబంధించిన వినతిపత్రాలపై తగిననిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర అత్యున్నత కోర్టు ఆదేశించినా.. వాస్తవంలోకి అది అమలు కాలేదు. ఈ నేపథ్యంలో నమోదైన కేసు విచారణ సందర్భంగా సోమేశ్ హాజరు కావాల్సి వచ్చింది. మరి.. హైకోర్టు ఇచ్చిన ఆరువారాల వ్యవధిలో కోర్టు ఆదేశాల్ని అమలు చేస్తారో? లేదో? చూడాలి.