Begin typing your search above and press return to search.

పటేల్ విగ్రహాన్ని రూ.30వేల కోట్లకు అమ్మకమా?

By:  Tupaki Desk   |   5 April 2020 6:28 AM GMT
పటేల్ విగ్రహాన్ని రూ.30వేల కోట్లకు అమ్మకమా?
X
ప్రభుత్వాలు ఎంత మంచివైనా.. అవి తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయనటానికి నిదర్శనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహాన్ని చెప్పొచ్చు. గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో సాధుబెట్ అనే చిన్నదీవిలో నిర్మించిన ఈ విగ్రహం గురించిన మెచ్చుకోళ్లు ఎన్ని ఉన్నాయో.. విమర్శలు అన్నే ఉన్నాయి. 182 మీటర్ల భారీ విగ్రహం కోసం రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టేశారు. తాజాగా ఈ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టేసిన వైనం షాకింగ్ గా మారింది.

అయితే.. అమ్మకానికి పెట్టేసింది ప్రభుత్వం కాదు. ఒక నెటిజన్. ప్రభుత్వ చర్యపై తనకున్న అగ్రహాన్ని ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టేయటం ద్వారా తన వాదనను ప్రపంచానికి తెలియజేసే పని చేశారు. అంతేకాదు.. తాను చెబుతున్న విషయంలో న్యాయం ఉండటంతో పాటు.. తనకు మద్దతు పలుకుతున్న వారిని సమీకరించే ప్రయత్నం చేయటం గమనార్హం.

పటేల్ సాబ్ విగ్రహాన్ని నిర్మించటం కోసం మోడీ సర్కార్ రూ.3వేల కోట్ల వరకూ ఖర్చు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ భారీ విగ్రహా ఫోటోను ఓఎల్ ఎక్స్ లో అప్ లోడ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. తానీ విగ్రహాన్ని రూ.30వేల కోట్లకు అమ్మేస్తున్నట్లు పేర్కొన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో ఐక్యతా విగ్రహాన్ని అమ్మకానికి పెట్టామని.. ఆ వచ్చే సొమ్ముతో హాస్పిటళ్లు.. వైద్య పరికరాల్ని కొనుగోలు చేయాలంటూ వ్యంగ్య పోస్టు పెట్టాడు.

కరోనా వేళ.. తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాల్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.3వేల కోట్లు పెట్టి విగ్రహాన్ని తయారు చేసే బదులు.. అదే సొమ్మును ప్రజల కోసం దాచి పెట్టి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు కదా? అన్నది సదరు వ్యక్తి వాదన. ఐక్యతా విగ్రహాన్ని తమ సైట్ లో అమ్మకానికి పెట్టినట్లుగా గుర్తించిన ఓఎల్ ఎక్స్ వెంటనే.. ఆ పోస్టును డిలీట్ చేసింది. అంతేకాదు.. గుర్తు తెలియని వ్యక్తులు అలాంటి పని చేశారని.. అందులో తమ తప్పు లేదంటూ చెంపలేసుకొని సారీ చెప్పింది.

మహానుభావులకు విగ్రహాలు పెట్టి స్మరించుకోవటం తప్పు లేదని.. కాకుంటే కూడుకు గుడ్డకు గతి లేని పేదలున్న దేశంలో గొప్పల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టేయటం ఏ మాత్రం న్యాయం కాదంటూ నెటిజన్లు కొందరు చేస్తున్న వాదన చూస్తుంటే.. విగ్రహాన్ని అమ్మకానికి పెట్టటం ద్వారా తానేం సాధించాలనుకున్నాడో సాధించినట్లుగా చెప్పక తప్పదు. ఈ పోస్టు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.