Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామ సెల్ లో ఉన్న మెసేజ్ ల్లో కొన్ని ఇలా ఉన్నాయట

By:  Tupaki Desk   |   20 July 2021 5:00 AM GMT
ఎంపీ రఘురామ సెల్ లో ఉన్న మెసేజ్ ల్లో కొన్ని ఇలా ఉన్నాయట
X
గెలిచిన పార్టీ అధినేత మీద అదే పనిగా విమర్శలు.. ఆరోపణలు.. ఘాటు వ్యాఖ్యలతో పాటు పలు రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన సంచలన అంశాలు బయటకు వచ్చాయి. ఆ మధ్యన కులాలు.. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో అరెస్టు చేయటం తెలిసిందే. ఆయన అరెస్టు చేసిన సందర్భంలో ఆయన ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఫోన్ ను విశ్లేషించిన అధికారులు.. దానిలోని అంశాల్ని నివేదికగా తయారు చేశారు. దాదాపు 230 పేజీల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ లోసుప్రీంకు సమర్పించారు.

రఘురామ ఫోన్ లో ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులతో జరిపిన చాటింగ్ బయటకు వెల్లడయ్యాయి. అందులో జగన్ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు తో పాటు టీవీ యాజమాన్యాలతో పాటు వారి సిబ్బందితో చేసిన చాటింగ్ లు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో శాంపిల్ గా కొన్నింటికి ప్రముఖ మీడియా సంస్థ ప్రచురించింది. అందులోని అంశాలు షాకింగ్ గా మారాయి.
ఆ మీడియా సంస్థ పేర్కొన్న వివరాల్ని యథాతధంగా చూస్తే..

- రఘురామకృష్ణరాజు: నాన్నగారి (చంద్రబాబు)తో ఇప్పుడే మాట్లాడా. సోమవారం మధ్యాహ్నానికల్లా మనం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. మనం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా చేసేందుకు ఈ ‘ప్రవీణ్‌’ దీన్ని పెండింగ్‌లో ఉంచేందుకు ప్రయత్నించవచ్చు. కానీ మనం సిద్ధంగా ఉండాలి. సుప్రీంకోర్టులో ఫెయిల్‌ అయితే మనం హెల్ప్‌లెస్‌ అవుతాం. కానీ మనం దీన్ని వదలొద్దు. నేను నావైపు నుంచి ఆట ఈ రోజే మొదలుపెడతా.

2021 మే 1న రఘురామకృష్ణరాజు – లోకేశ్‌ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ ఇదీ.

- రఘురామకృష్ణరాజు, లోకేశ్‌లు తమ సంభాషణల్లో పలుదఫాలు పలువురు న్యాయమూర్తుల పేర్లు, కోర్టుల బెంచ్‌ల పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఏ పిటిషన్‌ ఏ న్యాయమూర్తి ముందుకు విచారణకు రానుందో... ఆయన ఏ విధంగా స్పందిస్తారో... అలా అయితే మనం ఏం చేయాలో... అంటూ వారిద్దరూ చాటింగ్‌ చేయడం విస్మయపరుస్తోంది. న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు కూడా వివిధ అంశాలు ఆపాదిస్తూ వారిద్దరూ చర్చించుకోవడం గమనార్హం.

2021 ఏప్రిల్‌ 4న చంద్రబాబు, రఘురామ కృష్ణరాజు వాట్సాప్‌ చాటింగ్‌

రఘురామకృష్ణరాజు: సార్‌... జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఇది. అన్ని పాయింట్లూ కవర్‌ చేశా. (ఆ పిటిషన్‌ కాపీని వాట్సాప్‌ చేశారు)

చంద్రబాబు: నాకు లేటెస్ట్‌ వెర్షన్‌ను మళ్లీ పంపించగలవా?

రఘురామకృష్ణరాజు: సారీ సార్‌... ఇప్పుడే పంపిస్తా. (ఆ వెంటనే పిటిషన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను పంపించారు)

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా రెబల్ ఎంపీ రఘురామతో వాట్సాప్ లో చాటింగ్ చేసిన వైనాన్ని సీఐడీ తన అఫిడవిట్ లో వెల్లడించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసే పిటిషన్ ఎలా వేయాలి? అందులో ఏ అంశాలు ఉండాలి? లాంటి అంశాలపై చంద్రబాబు స్వయంగా సూచనలు చేసినట్లుగా ఆరోపించింది. రఘురామ పంపిన పిటిషన్ కాపీని స్వయంగా చేసిన చంద్రబాబు.. తన న్యాయ సలహాదారులతో చర్చలు జరిపిన తర్వాతే కోర్టులో దాఖలు చేసినట్లుగా సీఐడీ పేర్కొంది.