Begin typing your search above and press return to search.

గులాబీ ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

By:  Tupaki Desk   |   9 July 2018 7:47 AM GMT
గులాబీ ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!
X
అధికారంలో చేతిలో ఉంటే చాలు.. అది కాస్తా శాశ్వితంగా త‌మ‌తోనే ఉండాల‌ని త‌పించే వారు కోకొల్ల‌లు. ఎవ‌రూ కూడా చేతిలో ఉన్న అధికారాన్ని త్య‌జించేసి.. వాటికి దూరంగా వెళ‌తామ‌న్న మాట‌ను మాట వ‌ర‌స‌కు కూడా చెప్ప‌టం క‌నిపించ‌దు. కానీ.. అందుకు భిన్నంగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఒక‌రు చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు షాకిచ్చేలా చేసిన స‌ద‌రు ఎమ్మెల్యే ఎవ‌రు? ఆయ‌నేం చేశార‌న్న‌ది చూస్తే.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. టీఎస్ ఆర్టీసీ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. చేయాల‌నుకున్న ప‌నులు చేయ‌లేక‌పోతున్నాన‌ని.. అందుకే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించి షాకిచ్చారు. రామ‌గుండం మేయ‌ర్ అవిశ్వాస ప‌రిణామాల‌పై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ఇన్నాళ్లు త‌న‌కు అండ‌గా నిలిచిన వారికి ఆయ‌న థ్యాంక్స్ చెబుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

గులాబీ పార్టీలో త‌న‌కు గౌర‌వం లేద‌న్న ఆయ‌న‌.. పార్టీలో అవినీతిప‌రుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు ఆరోపించారు. భ‌విష్య‌త్తులో రాజ‌కీయ స‌న్యాసం తీసుకోనున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఆర్టీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చినా అధికారాలు ఇవ్వ‌లేద‌న్నారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ లోపించింద‌ని చెప్పిన ఆయ‌న‌.. తాను ప‌ద‌వుల్లో ఉన్నా విధుల‌కు మాత్రం హాజ‌రు కానంటూ తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు.

సోమార‌పు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల వెనుక రామ‌గుండం మున్సిపాలిటీలో చోటు చేసుకున్న రాజ‌కీయ‌మే కార‌ణంగా చెబుతున్నారు. పార్టీ అధినాయ‌క‌త్వంపై ఆయ‌న‌కున్న అసంతృప్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసేలా చేసిందంటున్నారు. మ‌రి.. దీనిపై పార్టీ చీఫ్ కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.