Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో అలజడి

By:  Tupaki Desk   |   15 Jun 2016 10:33 AM IST
అమెరికాలో మరో అలజడి
X
ఉగ్రవాదుల పంజాతో అమెరికా అతలాకుతలమవుతోంది. పెద్దన్న వైపు చూసేందుకు సైతం ఉగ్రవాదులు తటపటాయిస్తారన్న మాటలో నిజం లేదన్నట్లగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మొన్నటికి మొన్న అర్లెండో లోని గే క్లబ్ లో చోటు చేసుకున్న దారుణ మారణకాండ స్మృతిపథం నుంచి తొలగకముందే మరో దారుణానికి రంగం సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని అమారిలోని వాల్ మార్ట్ దగ్గర కాల్పుల కలకలం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అమారిలో లోని వాల్ మార్ట్ దగ్గర ఓ సాయుధుడు కాల్పులు జరపటంతో పాటు.. పలువురిని బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతం వైపు ప్రజలు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాల్ మార్ట్ కు చెందిన ఓ మాజీ ఉద్యోగే కాల్పుల దారుణానికి తెర తీసినట్లుగా కొన్నిస్థానిక కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. కాల్పుల తీవ్రత ఏమిటి? ఎంతమంది బాధితులు అయ్యారు లాంటివి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దుండగుడు వాల్ మార్ట్ స్టోర్ లోకి ప్రవేశించాడని మాత్రం చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆగంతకుడి ఆధీనంలో ఉన్న బంధీలంతా సురక్షితంగా బయటపడినట్లుగా చెబుతున్నారు. ఏమైనా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.