జగన్ సర్కారు కోర్టు కష్టాలకు సొల్యూషన్.. ‘మనుపాత్ర’

Tue Sep 14 2021 15:00:15 GMT+0530 (IST)

solution of Jagan Government court woes

చారిత్రక విజయం సాధించి.. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి.. ఐదేళ్ల పాలనకు ఏకాభిప్రాయమన్న రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ సర్కారుకు.. న్యాయస్థానాల్లో ఫైల్ అవుతున్న కేసుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. కాలు కదిపినంతనే.. పిటిషన్లతో స్వాగతం పలకటం.. ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఒక పాయింట్ ను హైలెట్ చేస్తూ.. పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్న వైనం ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వం.. ప్రస్తుత సర్కారుకు కలుపుకొని కోర్టు ధిక్కార కేసుల సంఖ్య ఏకంగా ఎనిమిది వేల మార్కును దాటేసిన దుస్థితి.దీంతో.. ఈ ప్రభావం రోజువారీ పాలన మీద ప్రభావం పడుతోంది. ఏదో ఒక కేసు కోసం అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో.. ఈ వ్యవహారం రోజువారీ పాలన మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దాఖలైన కోర్టు కేసుల్ని వేగవంతంగా పరిష్కరించాలన్న ఆలోచనకు జగన్ సర్కారు వచ్చింది. ఇందుకోసం ‘మానుపాత్ర’ పేరుతో ఒక యాప్ ను తీసుకురానుంది. దీని ద్వారా ఏ శాఖలో ఎన్ని కేసుల చొప్పున ఉన్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఉంటుంది.

కోర్టులో దాఖలైన కేసుల్ని వేగవంతంగా పరిష్కారం చూపగలిగితే.. ప్రభుత్వంలోని వివిధ శాఖల మీద అనవసరమైన భారం తగ్గటంతో పాటు.. అధికారులకు కోర్టు చుట్టూ తిరగటం తగ్గుతుందన్న అంచనాతో ఉంది. జగన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత తీసుకునే పలు నిర్ణయాలపై పెద్ద ఎత్తున పిటిషన్లు న్యాయస్థానాల్లో నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కోర్టు కేసుల విషయంలో అలసత్వం వద్దని.. సమయానుసారంగా కేసుల పురోగతిపై స్పష్టత కలిగి ఉండాలని ఆయా విభాగాల అధిపతుల్ని ఆదేశించారు.

అంతేకాదు.. కోర్టులకు అందించాల్సిన సమాచారాన్ని సకాలంలో అందించటం.. కేసులకు సంబంధించిన వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాదు.. విభాగాల వారీగా ఉన్న కేసులకు తగ్గట్లు.. ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని.. కిందిస్థాయిలో జరిగే తప్పులతో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ప్రతి ఆఫీసు నుంచి ఒకరు ప్రభుత్వ న్యాయవాదులతో లైజనింగ్ నిర్వహిస్తూ.. ప్రభుత్వ శాఖలకు.. ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు కోర్టు కేసులు త్వరగా ముగించేందుకు వీలుగా మనుపాత్ర యాప్ ను ఉపయోగించుకోవాలన్న సూచనను ఆయన చేస్తున్నారు.

ఇందుకోసం కొన్ని విభాగాల్లోని అధికారులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఉన్న ఎనిమిది వేల కేసుల్లో ఏ విభాగంలో అత్యధిక కేసులు ఉన్నాయన్న విషయం మీద లెక్కలు సిద్ధం చేసింది ప్రభుత్వం.

అత్యధికంగా రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబందించి 2వేల కేసులు ఉండగా.. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి 114 కేసులు.. పర్యాటక రంగానికి సంబంధించి యాభై కేసులు.. క్రీడా విభాగానికి సంబంధించినవి 52 కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వివిధ విభాగాల్లోని కేసులు.. వాటిని పరిష్కరించే విషయలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే.. ఆయా విభాగాల అధిపతుల మీద చర్యలు తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. మరి.. కొత్తగా తీసుకొచ్చిన యాప్ తో అయినా.. కోర్టు లెక్కలు ఒక కొలిక్కి వస్తాయా? అన్నది చూడాలి.