Begin typing your search above and press return to search.

రేవంత్‌... బాబు వ‌దిలిన బాణ‌మా?

By:  Tupaki Desk   |   2 Nov 2017 4:49 AM GMT
రేవంత్‌... బాబు వ‌దిలిన బాణ‌మా?
X
తెలంగాణ‌లో ఇక పార్టీ బ‌త‌క‌ద‌ని, అలాంటి పార్టీలో ఉన్నా ఇక ప్ర‌యోజ‌న‌మేమీ లేద‌న్న భావ‌న‌తో టీ టీడీపీని ఎమ్మెల్యేలంతా వీడిపోతున్నార‌ని అధికార టీఆర్ ఎస్ నిత్యం ప్ర‌చారం చేస్తూనే ఉంది. ఈ ప్ర‌చారంలో ఎంత‌మేర వాస్త‌వ‌ముంద‌న్న విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌బెడితే... ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ పార్టీ త‌ర‌ఫున అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు కూడా ల‌భించ‌ర‌న్న వాద‌న అయితే బ‌లంగానే వినిపిస్తోంది. మొన్న‌టిదాకా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన యువ‌నేత రేవంత్ రెడ్డి... ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి రేవంత్ హైద‌రాబాదు తిరిగి రాక‌ముందే ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డం, ఇక టీ టీడీపీ ప‌ని అయిపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపించ‌డం తెలిసిందే. అందుక‌నుగుణంగానే రేవంత్ రెడ్డి కూడా టీ టీడీపీకి గుడ్ బై కొట్టేసి మొన్న కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరిపోయారు. తానొక్క‌డే కాకుండా త‌న వెంట వ‌చ్చే ప‌లువురు టీ టీడీపీ నేత‌ల‌ను వెంట‌బెట్టుకుని వెళ్లిన రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో ఆ పార్టీలో చేరిపోయారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌ ను ఓ కంట క‌నిపెడుతూనే ఉండిపోయిన అధికార టీఆర్ ఎస్ పార్టీ పెద్ద‌గా నోరు విప్పిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఇక టీ టీడీపీ నేత‌ల‌తో పాటు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా ఈ విష‌యంపై మాట్లాడేందుకు ఆస‌క్తి చూప‌లేదు. అయితే టీడీపీ కంటే కాస్తంత ముందుగానే గొంతు స‌వ‌రించుకున్న టీఆర్ ఎస్ నిన్న‌టి నుంచే రేవంత్‌ పై ఎదురు దాడి మొద‌లెట్టేసింద‌నే చెప్పాలి. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు - తెలంగాణ కేబినెట్‌ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ఉన్న క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు నిన్న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో టీఆర్ ఎస్ కీల‌క నేత‌ - కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత - దుబ్బాక ఎమ్మెల్యేగానే కాకుండా అంచ‌నాల క‌మిటీ చైర్మ‌న్‌ గా ఉన్న సోలిపేట రామ‌లింగారెడ్డి కూడా నిన్న రేవంత్ ఎపిసోడ్‌ పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

అస‌లు రేవంత్ రెడ్డి త‌న‌కు తానుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల‌లేద‌ని, చంద్ర‌బాబే రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీలోకి పంపార‌ని ఆరోపించారు. నిన్న అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో చిట్‌ చాట్ సంద‌ర్భంగా ఈ వాద‌న‌లో నిజం లేక‌పోలేద‌న్న అనుమానం వ‌చ్చేలా సోలిపేట సంచ‌ల‌న వ్యాఖ్యలే చేశార‌ని చెప్పాలి. శరవేగంగా సాగుతున్న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు వదిలిన బాణమే రేవంత్‌ రెడ్డి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇందుకు నిద‌ర్శ‌నాలు కూడా లేక‌పోలేద‌న్న సోలిపేట‌... చంద్రబాబుపై రేవంత్‌ ప్రకటిస్తున్న విశ్వాసం, ఆయన చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అటు గోదావరి - ఇటు కృష్ణా నదుల మీద కడుతున్న ప్రాజెక్టులు అడ్డుకోవటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో చివరి అస్త్రంగా రేవంత్‌ రెడ్డిని వదిలారన్నారు. తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన రేవంత్, నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనమని ఎంత డబ్బిచ్చాడో గుట్టు విప్పితే తెలంగాణ ప్రజలు ఆయన విశ్వసనీయతను నమ్ముతారన్నారు.