Begin typing your search above and press return to search.

శంషాబాద్ లో సంచలనం.. పైలెట్ భార్య సూసైడ్..

By:  Tupaki Desk   |   27 Jun 2020 7:30 AM GMT
శంషాబాద్ లో సంచలనం.. పైలెట్ భార్య సూసైడ్..
X
అతడు పైలెట్. ఆమె ఐటీ ఉద్యోగిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చీకూ చింత లేని జీవితం. వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతున్న వేళ.. ఆమె ఆత్మహత్య చేసుకున్న వైనం తీవ్ర సంచలనంగానే కాదు షాకింగ్ గా మారింది. తన మరణానికి ముందు ఫేస్ బుక్ లైవ్ లోతన ఆవేదనను పంచుకున్న ఆమె మాటలు విన్నప్పుడు అయ్యో అనిపించకుండా ఉండవు.

ప్రేమిస్తున్నట్లుగా వెంటబడి.. పెళ్లి చేసుకునే వరకు ఒకలా.. పెళ్లి తర్వాత మరోలా వ్యవహరించిన తన భర్త నిజ స్వరూపాన్ని ప్రస్తావించటమే కాదు.. అందుకు సంబంధించిన వీడియోల్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన ఆమె తన ప్రాణాల్ని తానే తీసుకున్నారు. శాంషాబాద్ లో చోటు చేసుకున్న ఈ వైనం షాకింగ్ గా మారింది. లావణ్య ఐటీ ఉద్యోగిని. ఆమె భర్త వెంకటేశ్వరరావు పైలెట్ గా పని చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాతి రోజుల్లో తనను వేధించటమే కాదు.. శారీరక హింసకు గురి చేసినట్లు ఆరోపించింది.

ఆత్మహత్య చేసుకోవటానికి ముందు ఫేస్ బుక్ లైవ్ లో స్నేహితులతో తన ఆవేదనను పంచుకుంది. ఇష్టంగా ప్రేమించిన వ్యక్తే వేధించటం.. కొట్టటం బాధగా ఉందన్న ఆమె.. తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. తానిక బతకలేనని పేర్కొన్న ఆమె.. ‘‘మీరు నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. మీకు దూరమైపోతున్నా. నా భర్తతో జీవించలేను’’ అని పేర్కొంది.

భార్యను వేధిస్తూ.. వెంకటేశ్వరరావు వివాహేతర సంబంధాలు నడిపేవాడన్న ఆరోపణను బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. లావణ్యపై చేయి చేసుకోవటం.. ఎంత తీవ్రంగా కొట్టేవాడన్న విషయాన్ని తెలిసేలా సీసీ కెమేరా పుటేజ్ బయటకు వచ్చి సంచలనంగా మారింది. అన్ని ఉండి కూడా.. అనవసరమైన ఆశకు పోయి.. ఒక జీవితాన్ని బలి తీసుకోవటమే కాదు.. తానూ ఇరుకున పడ్డ ఈ పైలెట్ జీవితం ఎందరికో కనువిప్పు కావాలి.