Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేకి ఆ సామాజికవర్గం నేతల సెగ!

By:  Tupaki Desk   |   9 Feb 2023 11:11 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేకి ఆ సామాజికవర్గం నేతల సెగ!
X
నెల్లూరు పరిణామాలు ఇలా కొనసాగుతుండగానే ఈసారి ప్రకాశం జిల్లాలో వైసీపీలో అసమ్మతి పోరు రాజుకుందనే వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యేగా సుధాకర్‌ బాబు ఉన్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన సుధాకరబాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పట్లో కాంగ్రెస్‌ అధిష్టానం రాహుల్‌ గాంధీ తదితరులతో సంబంధాలతో సుధాకరబాబు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాగలిగారు.

ఆ తర్వాత 2019లో వైసీపీలో చేరిన సుధాకరబాబుకు గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి చాన్సు లేకపోవడంతో గుంటూరు జిల్లాను ఆనుకుని ఉండే సంతనూతలపాడు సీటును ఇచ్చారు. వైసీపీ గాలిలో స్థానికుడు కానప్పటికీ సుధాకరబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మొదట్లో పరిస్థితులు బాగానే ఉన్నా.. రానురాను ఎమ్మెల్యే సుధాకరబాబు ఒంటెద్దు పోకడలు పోతున్నారని.. పార్టీలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. బాలినేని చొరవతో కొంతకాలం పరిస్థితి సద్దుమణిగింది.

సంతనూతలపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైనా కమ్మ సామాజికవర్గం కీలకంగా ఉంది. వీరంతా గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతిచ్చారు. అయితే ఇప్పుడు సుధాకరబాబు తమను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని వారంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకమైనట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సుధాకరబాబుకు సీటు ఇస్తే తాము అతడిని గెలిపించే పరిస్థితి లేదని వైసీపీ పెద్దలకే తేల్చిచెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

అధికారుల బదిలీలలో పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకుల మాటను సుధాకర్‌ అసలు అస్సలు పట్టించుకోకపోవడంతో కమ్మ సామాజికవర్గ నేతలు ఎమ్మెల్యేపై గుస్సా అవుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే సుధాకర్‌ తన వ్యక్తిగత సహాయకుల్లో ఐదుగురికి చీమకుర్తి నగర పంచాయతీ నుంచి జీతాల చెల్లింపులు చేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అలాగే, తనకు అనుకూలమైన కొందరికే కాంట్రాక్టు పనులు ఇప్పించడం చేస్తున్నారని.. తమకు ఏ పనీ ఇవ్వడం లేదని కమ్మ సామాజికవర్గం నేతలు ఫైర్‌ అవుతున్నారని టాక్‌ నడుస్తోంది.

ఇప్పటికే వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు. కానీ కమ్మ నేతలు , ఎమ్మెల్యే మధ్య సయోధ్య కుదరలేదని చెబుతున్నారు.

తాజాగా కొందరు నాయకులు ఆత్మగౌరవం పోరాటం పేరుతో కొద్ది రోజుల క్రితం ఒంగోలులో సమావేశమయ్యారు. 12 మందితో ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 100 మంది కమ్మ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారని చెబుతున్నారు. తమను లెక్కచేయని ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు మీద చర్యలు తీసుకోవాల్సిందేనని వీరంతా డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.

కాగా ఇప్పటికే ప్రకాశం జిల్లా నాగులుప్పడపాడు మండలం కనపర్తి గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యే సుధాకర్‌ బాబుకి నిరసన సెగ ఎదురైంది. 'ఎమ్మెల్యే గారూ మా ఊరికి రావద్దు' అంటూ ఊరి ప్రజలు నిరసన చేపట్టడం విశేషం. ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు నాగులుప్పడపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతోపాటు గ్రామ వైసీపీ నేతల్లో కొందరు ఊరికి వచ్చే రహదారిపై నల్ల జెండాలు పట్టుకుని నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే గారు మా ఊరికి రావద్దు అంటూ నినదించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని గ్రామస్తులు అంటున్నారు. మాటలు చెప్పడం తప్ప పనులు మాత్రం కావడం లేదని ఆరోపించారు. రాపర్ల - చవటపాలెం రోడ్డు దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రావెల్‌ రోడ్డు అయినా నిర్మించాలని ఎమ్మెల్యేకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.