Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా టాక్స్ : పోతే ప‌వ‌న్...వ‌స్తే బీజేపీ

By:  Tupaki Desk   |   1 Jun 2022 2:30 AM GMT
సోష‌ల్ మీడియా టాక్స్ : పోతే ప‌వ‌న్...వ‌స్తే బీజేపీ
X
ఆంధ్రావ‌ని వాకిట పొత్తుల లెక్క‌లు తేల‌డం లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బీజేపీ వెళ్తుందా వెళ్ల‌దా అన్న‌ది క్లారిటీ లేదు. ప‌వ‌న్ ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే విష‌య‌మై బీజేపీ ఇప్ప‌టిదాకా ఎటువంటి ప్ర‌క‌ట‌న‌కూ సిద్ధ‌మై లేదు. ఎందుకంటే అది బీజేపీ సిద్ధాంతం కాదు అని ఆ పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. అంటే ఎన్నిక‌లు అయ్యాక, ఫ‌లితాలు తేలాక అప్పుడు మాత్ర‌మే సీఎం అభ్య‌ర్థి ఎవ‌రు అన్న‌ది డిసైడ్ చేస్తార‌ని అంటున్నారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా జ‌న‌సైనికులు మాత్రం త‌మ అధినేత‌నే సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని, అప్పుడే తాము పొత్తుల ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి ప‌నిచేస్తామ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వారంతా సోష‌ల్ మీడియాలో ఇదే విష‌య‌మై పోస్టులు మీద పోస్టులు ఉంచుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము త‌మ అధినేత ప‌వ‌న్ ను సీఎం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తామే కానీ ఎవ్వ‌రికీ బోయిలం కాబోమ‌ని, వేరే పార్టీల ప‌ల్ల‌కీల మోత‌కు తాము సిద్ధంగా లేమ‌ని కూడా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ తో పొత్తు అన్న‌ది ఎటూ తేల‌ని విష‌య‌మై ఉంది.

టీడీపీ కూడా పొత్తు విష‌య‌మై అస్స‌లు క్లారిటీతో లేదు. మ‌హానాడు జోష్ లో ఉంది ఇంకా! ఆ పార్టీ నాయ‌కులంతా కూడా అప్పుడే ఎందుకు తొంద‌ర అన్న విధానం ఒక‌టి పైకి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వాస్త‌వానికి జ‌న‌సేన‌తో టీడీపీకి పొత్తు ఉంటే జనసేనకు న‌ష్టం ప‌వ‌న్ కి మాత్రం గౌరవం అంతకుమించి ఏముంది అంటున్నారు! అంటే చంద్రబాబు పవన్ ను గౌరవించడం తప్ప జనసేను ఏమీ పైకి తీసుకురారు కదా అన్నది వారి అభిప్రాయం.

గ‌తంలో కూడా ఇదే క‌దా నిరూప‌ణ అయింది. క‌నుక జ‌న‌సేన‌తో పొత్తు విష‌య‌మై టీడీపీ సానుకూలంగా ఉంటే ఉండ‌వ‌చ్చు. కానీ గ‌త అనుభ‌వాల‌ను ఇప్ప‌టికీ మోస్తున్న సామాన్య కార్య‌క‌ర్త‌లు మాత్రం చంద్ర‌బాబుతో మైత్రిని అంగీక‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. పోనీ పవన్ సీఎం అభ్యర్థి టీడీపీ కార్యకర్తే కాదు, విశ్లేషకులు కూడా అంగీకరించరు. ఎందుకంటే నిర్మాణమే లేని పార్టీకి దానికంటే పెద్ద పార్టీ ముందే సీఎం సీటును ఎందుకు అప్పగిస్తుందన్న ఒక వాలిడ్ ప్రశ్న వేస్తున్నారు. రాజకీయ లెక్కల ప్రకారం విశ్లేషించుకుంటే అవసరమైతే ప్రతిపక్షంలో ఉండటానికి అయినా టీడీపీ అంగీకరిస్తుందేమో గాని పవన్ ను సీఎం అభ్యర్థిగా పొత్తుకు అంగీకరించలేదు అనంటున్నారు.

ఇక సోము వీర్రాజు లాంటి నేత‌లు కూడా తెరపైకి వ‌చ్చి ఏవేవో మాట్లాడి వెళ్తున్నారు. సోము వీర్రాజు కానీ జీవీఎల్ కానీ కొన్ని రోజులు ఏమీ మాట్లాడ‌కుండా ఉంటేనే బెట‌ర్. కిష‌న్ రెడ్డి లాంటి వారికి కూడా ప‌వ‌న్ అంటే కాస్త ఇష్టంగానే ఉంది. క‌నుక బీజేపీతో మైత్రిని ప‌వ‌న్ కొన‌సాగించాలంటే అందుకు అధిష్టానంతో ఒప్పించేందుకు చేసే ప‌నికి కిష‌న్ రెడ్డి లాంటి పెద్ద‌లు పూనిక వ‌హించాల్సి ఉంటుంది.

అంతేకానీ చెప్పుకోద‌గ్గ రీతిలో జనాక‌ర్ష‌ణ లేని సోము వీర్రాజు లాంటి నేత‌లు మాట్లాడ‌డం వ‌ల్ల పార్టీకి పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు అని పరిశీల‌కులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ కు బీజేపీతో పొత్తు కూడా పెద్ద‌గా లాభం చేకూర్చే విష‌యం కాద‌ని ఇంకొంద‌రు అంటున్నారు. పవన్ బీజేపీ మైత్రి వల్ల కేవలం బీజేపీకి మాత్రమే లాభం. ఎందుకంటే ఏ నియోజకవర్గంలోను నోటా కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి లేవు. అవి జనసేనకు వచ్చినా రాకున్నా ఒకటే. అందుకే పోతే ప‌వ‌న్...వ‌స్తే బీజేపీ అని వ్యాఖ్యానిస్తున్నారు.