Begin typing your search above and press return to search.

మెరీనా బీచ్ కు అన్నివేల మంది ఎలా వచ్చారు?

By:  Tupaki Desk   |   19 Jan 2017 9:34 AM GMT
మెరీనా బీచ్ కు అన్నివేల మంది ఎలా వచ్చారు?
X
జల్లికట్టును నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ యావత్ తమిళనాడు మండిపడుతున్న వైనం తెలిసిందే. తమిళనాడురాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా.. ఈ బ్యాన్ పై సరికొత్త నిరసనకు మెరీనా బీచ్ కార్యక్షేత్రంగా ఎలా మారింది? బీచ్ వద్దకు అన్ని వేలమంది ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరు దీనివెనుక ఉన్నారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే సమాధానం అస్సలు దొరకదు.

ఏ ఒక్క నేత.. ఏ ఒక్క ప్రముఖుడు పిలుపు ఇవ్వకుండానే మెరీనా బీచ్ జనసంద్రంగా మారిపోయింది. వేలాది మంది ప్రజల రాకతో బీచ్ మొత్తం మనుషులతో నిండిపోయింది. వచ్చిన ప్రతిఒక్కరూ జల్లికట్టుపై విధించిన నిషేధాన్నితీవ్రంగా నిరసిస్తున్న వారే. మెరీనా బీచ్ వద్దకు వచ్చిన వారిలో ఎక్కువ మంది యువకులు.. విద్యావంతులు.. యువ ప్రొఫెషనల్స్ ఉండటం కనిపిస్తుంది.

అనవసరమైన హడావుడి చేయకుండా.. ప్రశాంతంగా నిరసన చేయటమే కాదు.. బుధవారం మొదలైన ఈ నిరసన.. గురువారం మధ్యాహ్నానానికి కూడా కొనసాగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతమంది ఎలా చేరుకున్నారన్న విషయాన్ని లోతుగాచూస్తే.. దీని వెనుక ఉంది మరెవరో కాదు సోషల్ మీడియా అన్న విషయం అర్థమవుతుంది.

జల్లికట్టుపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకించే వారంతా మెరీనా బీచ్ వద్దకు చేరుకోవాలంటూ పేర్కొన్న ఒక మేసేజ్ సోషల్ మీడియాలైన వాట్సప్.. ఫేస్ బుక్.. ట్విట్టర్ లతో షేర్ కావటంతో ఎవరికి వారుగా మెరీనా బీచ్ కు చేరుకున్నారు. సామాన్యుల మాదిరే సెలబ్రిటీలు సైతం మెరీనాకు చేరుకోవటంతో ఈ నిరసన ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా నెలకొన్న నిరసనలతో ఈ నెల 31 వరకూ చెన్నైలోని కాలేజీలన్నింటిని సెలవులు ఇచ్చేయటం గమనార్హం. సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ గా తయారైందనటానికి తాజా ఉదంతం ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/