Begin typing your search above and press return to search.

మోడీకి కొత్త బిరుదు ఇచ్చేసిన సోషల్ మీడియా

By:  Tupaki Desk   |   13 May 2021 3:38 AM GMT
మోడీకి కొత్త బిరుదు ఇచ్చేసిన సోషల్ మీడియా
X
ఆరేళ్లు అప్రతిహతంగా సాగిన మోడీ జైత్రయాత్ర.. కరోనా పుణ్యమా అని.. మసకబారిందని చెప్పాలి. కరోనా మొదటి వేవ్ వేళ.. ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని సక్సెస్ కాకున్నా... లాక్ డౌన్ విషయంలో ఆయన తీసుకున్న రెప్పపాటు నిర్ణయం ఆయన ఇమేజ్ ను పెంచింది. మొదటి వేవ్ ను తక్కువ నష్టంతో దేశం తప్పించుకోగలిగింది. ఆర్థికంగా దేశానికి తీవ్ర ఇబ్బంది ఎదురైనప్పటికి .. సెకండ్ వేవ్ మాదిరి కరోనా దెబ్బకు విలవిలలాడిపోలేదు.

సెకండ్ వేవ్ ముప్పు మీద పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ అయినప్పటికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన మోడీ ప్రభుత్వం భారీ తప్పును చేసింది. ఓవైపు కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నా.. అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచార సభలకు హాజరు కావటం.. అధికారాన్ని సొంతం చేసుకునేందుకు ప్రదర్శించిన తపన.. జాతి జనులకు మండేలా చేసింది. దీంతో.. ఎప్పుడూ లేనంత అపఖ్యాతిని మూటగట్టుకోవటమే కాదు.. సెకండ్ వేవ్ పాపం మొత్తం ఆయన ఖాతాకే జమైంది.

ఇలాంటివేళ.. గతంలో మోడీ మీద విమర్శ చేయాలంటే వెనుకాడిన వారంతా... ఇప్పుడు మరింతలా చెలరేగుతున్నారు. ఆయన పాలనలోని లోపాల్ని తట్టి చూపేలా మీమ్స్ తయారు చేస్తున్నారు. జోకులు.. బుల్లి వీడియోలు.. ఇమేజ్ ల్ని కసిదీరా సోషల్ మీడియాలో కుమ్మరిస్తున్నారు. మిస్టర్ మోడీ కాదని.. క్యూ పీఎం అంటూ సరికొత్త బిరుదును సోషల్ మీడియా సాక్షిగా ప్రధానం చేశారు.

ఇంతకీ క్యూ పీఎం అంటే ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు పేరుతో జాతి ప్రజల్ని బ్యాంకుల ముందు క్యూలో నిలుచోబెట్టి.. సెకండ్ వేవ్ లో ఆసుపత్రిలో బెడ్ల కోసం క్యూ కట్టేలా.. వ్యాక్సిన్ కోసం క్యూ కట్టేలా చేయటమే కాదు.. చివరకు చనిపోయిన మనిషికి అంత్యక్రియల కోసం శశ్మనాల వద్ద క్యూలో నిలుచునేలా చేసిన.. అపూర్వమైన క్యూ పీఎం మోడీ అంటూ ఘాటుగా మండిపడుతున్నారు. చూస్తుంటే.. ఈ విమర్శల జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదన్న మాట వినిపిస్తోంది.