Begin typing your search above and press return to search.

‘పంచాయతీ’ల్లో సోషల్ పోరు

By:  Tupaki Desk   |   19 Jan 2019 10:35 AM GMT
‘పంచాయతీ’ల్లో సోషల్ పోరు
X
పల్లె పోరు తెలంగాణలో ఉధృతంగా సాగుతోంది. సర్పంచ్, వార్డు సభ్యులు బరిలో నిలిచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుండగా.. మరి కొందరు టెక్నాలజీ బాట పట్టారు. ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా తమకు కేటాయించిన గుర్తులతో ఫొటోలు అప్ లోడ్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వాట్సాప్ లో ప్రత్యేకంగా గ్రామ సభ్యులతో ఒక గ్రూపు తయారు చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. మేనిఫెస్టోలను సైతం ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. గెలిస్తే ఏం చేస్తామో సోషల్ మీడియాల్లో పేర్కొంటున్నారు. గ్రామానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాలు చేస్తామని హామీలిస్తున్నారు.

ఇక సర్పంచ్ నుంచి వార్డుల సభ్యులందరూ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని అందులోనే గెలుపు వ్యూహాలు, చర్చలు చేసుకుంటూ ప్రచారాన్ని ఈసారి అభ్యర్థులు హైటెక్ బాట పట్టిస్తున్నారు. ప్రత్యర్థుల్లో ఉన్న అసమ్మతి నేతలను వాట్సాప్ లో చేర్చి వారి వద్ద సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రస్తుతం ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించేందుకు టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు.

ముఖ్యంగా గ్రామంలో ఓటు ఉండి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ సోషల్ మీడియా ద్వారానే గాలం వేస్తున్నారు. తాము సర్పంచ్, వార్డు సభ్యులుగా ఉన్నామని.. ఫోన్ చేసి.. వారికి వాట్సాప్ ద్వారా వివరాలు పంపిస్తూ అభ్యర్థిస్తున్నారు. గ్రామానికి వచ్చి ఓటు వేయాలని.. మీకు ‘అన్ని విధాలా’ సహకరిస్తామంటూ తాయిలాలూ ప్రకటిస్తున్నారు. కొందరు సెల్ ఫోన్ బిల్లులు, విద్యుత్ బిల్లు, కులాయి బిల్లు, డిష్ బిల్లులు, ఇంటి అద్దె కూడా ఇస్తామని ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నట్టు సమాచారం.