Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా అలా చీలిపోయిందా?

By:  Tupaki Desk   |   14 March 2016 11:30 AM GMT
సోషల్ మీడియా అలా చీలిపోయిందా?
X
ఒకప్పుడు సమాచారం కావాలంటే రేడియో.. పత్రికలు.. పుస్తకాలు మాత్రమే ఆధారం అయ్యేవి. ఆ తర్వాత వచ్చిన టీవీ పుణ్యమా అని పరిస్థితుల్లో కొంత మార్పు వస్తే.. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడి అభిప్రాయాలు.. భావనలు అన్ని నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చునే పరిస్థితి. సామాన్యుడు సైతం.. ఏ విషయం మీదనైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేసే పరిస్థితి. గతంలో ఫిల్టర్ చేసినట్లుగా అభిప్రాయాలు బయటకు వస్తే.. తాజాగా మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఎవరు ఏం అనుకున్నా.. మరొకరితో సంబంధం లేకుండా తన అభిప్రాయాల్ని నలుగురితో పంచుకునే అద్భుత అవకాశాన్ని సోషల్ మీడియా కల్పించింది. అయితే.. ఇలాంటి వేదిక మీద తమ వాదనలు వినిపిస్తున్న వారి విషయానికి సంబంధించి తాజాగా వచ్చిన వాదన ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం 12వ వార్షిక జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ‘‘ఎన్నికల పరిపాలనలో నూతన మీడియా ప్రభావం.. ఎన్నికల్లో కండ.. ఆర్థిక బలాన్ని తగ్గించేందుకు వినూత్న ఆలోచనలు’’ అన్న అంశం మీద చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖులు.. సోషల్ మీడియాలో రాస్తున్న వారంతా అరకొర అవగాహనతో రాసేస్తున్నారని.. ఇలాంటి వారి వల్ల ఊహా జనిత ఆలోచనలు పుట్టుకొస్తున్నాయని.. దీని వల్ల లేనిపోని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టింగ్ లలో లైక్ ల కోసం రాసే రాతలు వద్దని పలువురు ప్రముఖులు వాదించటం గమనార్హం.

విషయం ఏదైనా.. దేని గురించైనా రాయాల్సి వస్తే వామపక్ష భావజాలంతో రాస్తే ఆ వర్గం వారు లైక్ చేస్తుంటే.. సంప్రదాయ భావజాలంతో రాసినోళ్లను ఆ వర్గం వారు లైక్ చేస్తున్నారని.. మధ్యేమార్గంగా రాస్తున్న వారిని అస్సలు పట్టించుకోవటం లేదన్న విశ్లేషణ ఒకటి బయటకు వచ్చింది. ఇదెంత వరకూ నిజం అన్నది చూస్తే.. తొలి నుంచి ఒక వర్గం వారి అభిప్రాయాలకు మాత్రమే పెద్దపీట వేసిన మీడియాదే ఈ పాపం అన్నది మర్చిపోకూడదు. ఏదైనా అంశంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు మీడియా బాధ్యత పేరుతో.. తమకు తాముగా నియంత్రణలు పెట్టుకోవటం.. హద్దులు గీసుకోవటం ఒక పెద్ద సమస్యగా చెప్పొచ్చు.

మీడియాలో కనిపించే రాతలు దాదాపుగా ఒకవిధంగా ఉండటం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ భిన్న వాదనలు వినిపించినా.. ఒక వాదన విషయంలో బలంగా తన వాదనను వినిపించే మీడియా.. రెండో వాదనను అట్టే హైలెట్ చేయకపోవటం గమనార్హం. ఇలాంటి పరిస్థితులకు చెక్ చెప్పేలా సోషల్ మీడియా అవకాశం కల్పించిందన్న విషయం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు సుద్దులు చెప్పే పెద్దమనుషులు తొలుత మీడియా అనుసరిస్తున్న విధానాన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తే మంచిది.

నలుగురు సామాన్యులు రాసే రాతల కంటే కూడా మీడియాలో వచ్చే అక్షరాలే శక్తివంతమైనవన్న విషయం మర్చిపోకూడదు. బలమైన మీడియా సంస్థలు రెండు వర్గాల వారి వాయిస్ ను సమానంగా వినిపించి ఉంటే.. సోషల్ మీడియా వరకూ ప్రజలు వెళ్లాల్సిన అవసరమే లేదన్న విషయం మర్చిపోకూడదు. తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా చెప్పే విధానాన్ని వదిలేసి.. హద్దుల పేరిట తమను తాము నియంత్రించుకునే మీడియా కారణంగానే అరకొర అభిప్రాయలకు సోషల్ మీడియాలో ఆదరణ లభిస్తుందన్న విషయం మర్చిపోకూడదు.