Begin typing your search above and press return to search.

షా కొడుకు అయితే ఏమిటి? అంటూ సూటిగా అడిగేశాడు

By:  Tupaki Desk   |   8 Dec 2019 4:23 AM GMT
షా కొడుకు అయితే ఏమిటి? అంటూ సూటిగా అడిగేశాడు
X
మొహమాటాలకు పోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం అందరికి చేతనయ్యే పని కాదు. అవసరమైన వేళలో కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా మాట్లాడటానికి సైతం వెనుకాడని తీరు బీసీసీఐ చీఫ్ సారభ్ గంగూలీలో కాస్త ఎక్కువే. ఎవరో ఏదో అనుకుంటారని తగ్గటం అతనికి అస్సలు చేతకాదు. నలుగురు మాట్లాడే మాటల్ని చర్చకు తీసుకొచ్చి మరీ తన స్టాండ్ ఏమిటన్న విషయాన్ని తేల్చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేసి వార్తల్లోకి వచ్చారు గంగూలీ.

ఇవాల్టి రోజున దేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంత పవర్ ఫుల్ అన్నది చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి షా కుమారుడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వెరవకుండా ఓపెన్ గా తాను చెప్పాల్సింది చెప్పేయటం ద్వారా తనను అందరూ ‘దాదా’ అని ఎందుకు ముద్దుగా పిలుచుకుంటారన్నది తేల్చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2019కు హాజరైన గంగూలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రిగా అమిత్ షా ఉండటం వల్లే ఆయన కుమారుడు జే షా బీసీసీఐలోని కీలక పదవిలో ఉన్నట్లు వస్తున్న విమర్శల్ని గంగూలీ సింఫుల్ గా తేల్చేశారు. ప్రముఖ వ్యక్తులు బోర్డులో ఉండటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్న ఆయన.. ఇంటిపేర్లు చూసి మాట్లాడటం సరికాదన్నారు.

బీసీసీఐ కార్యదర్శి జే షా కేంద్రమంత్రి అమిత్ షా కొడుకైతే ఏంటి? ఆయన ఎన్నికల్లో గెలిచి పదవిని చేపట్టారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో ఆరేడేళ్లుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరైనా ప్రముఖ వ్యక్తి కొడుకో.. కూతురో అయితే వారికి ఎందులోనూ భాగస్వామ్యం ఉండకూడదని భావిస్తారని పేర్కొన్నారు. సచిన్ టెండుల్కర్ నే తీసుకుంటే.. అతడెప్పుడు తన కొడుకును క్రికెటర్ గా చూడాలంటారే కానీ సచిన్ కొడుకుగా చూడటానికి ఒప్పుకోరన్నారు. టెండూల్కర్ కొడుకు క్రికెట్ ఆడకపోవటానికి కారణం అతడు సచిన్ కుమారుడు కావటమేనని పేర్కొన్నారు.

ఇంటిపేర్లను మర్చిపోవాలని.. సదరు వ్యక్తి మంచోడా? చెడ్డోడా? అన్నది మాత్రమే చూడాలన్నారు.మన దేశంలో ఉన్న పరిస్థితి ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాలో ఉండదన్నారు. మార్క్ వా.. స్టీవా ఇద్దరూ అన్నదమ్ములని.. అయినా ఆసీస్ జట్టు తరఫున ఏకంగా వంద టెస్టులు ఆడిన వైనాన్ని గుర్తు చేశారు. గంగూలీ మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. ఆయా దేశాల్లో మాదిరి పరిస్థితులు మన దగ్గర లేవన్న వాస్తవాన్ని కూడా ఒప్పుకుంటే బాగుండేది.