Begin typing your search above and press return to search.

అక్క‌డ అలా.. ఇక్క‌డ ఇలా.. కాంగ్రెస్ ఫ్యూచ‌రేంటి..?

By:  Tupaki Desk   |   13 Jun 2021 9:30 AM GMT
అక్క‌డ అలా.. ఇక్క‌డ ఇలా.. కాంగ్రెస్ ఫ్యూచ‌రేంటి..?
X
సుదీర్ఘ కాలం దేశాన్ని, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి? ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ పార్టీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇటు ఏపీలోనూ.. అటు జాతీయ‌స్థాయిలోనూ కాంగ్రెస్‌కు పుంజుకునేందుకు అనేక అవ‌కాశాలు ఉన్నాయి. క‌రోనా నేప‌థ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే వాద‌న దేశ‌వ్యాప్తంగా బ‌లంగా వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఏపీలోనూ ప‌లు వర్గాల్లో ప్ర‌భుత్వంపై అసంతృప్తి ఉంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల లోపాల‌ను, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారు. కానీ, అదేంటో .. కాంగ్రెస్ అటు ఢిల్లీలో కానీ, ఇటు ఏపీలోనూ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ నైరాశ్యం ఆవ‌రించింది. జాతీయ స్థాయిలో ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బ‌తింది. దీంతో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పార్టీ కీలక నేత‌లు చేజారుతున్నారు. ఇటీవ‌ల జితిన్ ప్ర‌సాద్‌.. పార్టీ నుంచి జంప్ చేశారు.

అదేవిధంగా రేపో మాపో.. మ‌రో కీల‌క నేత‌, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కుమారుడు అభిజిత్ కూడా పార్టీ మారిపోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంకో ప‌క్క రాహుల్ గాంధీ ఇమేజ్ నానాటికీ స‌న్న‌గిల్లుతోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక‌, ఏపీ విషయానికి వ‌స్తే.. ఇక్క‌డ పార్టీ చీఫ్‌గా ఉన్న సాకే శైల‌జా నాథ్ వైఖ‌రిపై ఉన్న‌వారిలోనూ అసంతృప్తి నెల‌కొంది. చాలా మంది నాయ‌కులు.. ఆయ‌న అధ్య‌క్ష వ్య‌వ‌హార శైలిపై మౌనంగా ఉంటున్నారు. సీఎం జ‌గ‌న్‌పైకానీ, ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై కానీ.. సాకే స‌రైన విధంగా స్పందించ‌డం లేద‌ని.. సీనియ‌ర్లు గుస‌గుస‌లాడుతున్నారు.

ప‌రిస్థితి ఇలానే ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పార్టీ పుంజుకు నే అవ‌కాశం లేద‌ని.. ఉన్న‌వారు కూడా చేజారిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఘ‌ర్ వాప‌సీ.. నినాదంతో పార్టీ నుంచి చేజారిన నేత‌ల‌ను తిరిగి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలుచేసినా.. ఎక్క‌డా స‌ఫ‌లీ కృతం కాలేదు. మ‌ళ్లీ ఈ విష‌యంపై ఎవ‌రూ స్పందించ‌డం లేదు. ఈ క్ర‌మంలో అటు జాతీయ స్థాయిలోను, ఇటుఏపీలోనూ.. కాంగ్రెస్ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డుతోంద‌ని అంటున్నారు.