Begin typing your search above and press return to search.

రైతుల మరణాలపై మరీ ఇంత అవహేళన.. ఎటకారమా?

By:  Tupaki Desk   |   15 Feb 2021 11:36 AM GMT
రైతుల మరణాలపై మరీ ఇంత అవహేళన.. ఎటకారమా?
X
అధికారం తలకెక్కితే నేతల నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయనటానికి నిదర్శనంగా హర్యానా రాష్ట్ర వ్యవసాయ మంత్రి మాటలు ఉన్నాయని చెప్పాలి. గడిచిన మూడు నెలలకు పైనే రైతులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పటమే కాదు.. దేశ రాజధాని సరిహద్దుల్లో వణికించే చలిలో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని ఆకర్షించిన వీరి నిరసనకు పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమవుతోంది. మోడీ సర్కారు తీరును పలువురు తప్పు పడుతున్నారు.

ఇలాంటివేళ.. తాను తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్షించుకోవాల్సింది పోయి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. తాజాగా హర్యానా రాష్ట్ర బీజేపీ మంత్రి జేపీ దలాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ప్రాణాలు వదిలిన రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. వారిని అవహేళన చేసేలా.. ఎటకారం ఆడేలా ఉండటాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

ఎక్కడ చనిపోతే ఏం? ఇంట్లో ఉంటే మాత్రం చనిపోకుండా ఉంటారా? వారు ఇష్టపూర్వకంగానే మరణించారు. కొన్ని లక్షల మంది జనాభాలో రెండు వందల మంది చనిపోతే అదేమంత పెద్ద విషయమా? అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో.. తాను చేసిన వ్యాఖ్యల్లోని తప్పును గుర్తించిన మంత్రి క్షమాపణలు చెప్పినా.. ఆయన మాటలకు గాయపడ్డ మనసులు మాత్రం రగిలిపోతూనే ఉన్నాయి.

మంత్రి వ్యాఖ్యల్ని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించటమే కాదు.. ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే.. హర్యానాలోని బీజపీ సర్కారుకు ప్రజలు తగిన గుణపాటం చెబుతారని వార్నింగ్ ఇచ్చింది. దేశం కోసం సైనికులు.. రైతులు చేస్తున్న త్యాగాల్ని ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కిసాన్ మహా పంచాయత్ పేర్కొంది.

సాగు చట్టాలపై ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలుతమ వద్ద లేవని పార్లమెంటు సాక్షిగా మంత్రి చెప్పటం ప్రభుత్వానికి సిగ్గుచేటుగా పేర్కొన్నారు. ఏమైనా.. పెద్ద ఎత్తున సాగుతున్న రైతుల ఉద్యమాన్ని కేంద్రం కావాలని పట్టించుకోకపోయినా ఫర్లేదు.. వారి ఆత్మాభిమానం దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయటం.. బీజేపీకి మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిత్యం నీతులు వల్లించే ప్రధాని మోడీ.. హర్యానా వ్యవసాయ మంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది.