Begin typing your search above and press return to search.

అప్పుడు సార్స్ మాదిరే... ఇప్పుడు కరోనా కూడా అంతరిస్తుందా?

By:  Tupaki Desk   |   13 May 2020 6:00 AM IST
అప్పుడు సార్స్ మాదిరే... ఇప్పుడు కరోనా కూడా అంతరిస్తుందా?
X
ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు యావత్తు ప్రపంచం దాదాపుగా ఒక్కతాటిపైకి వచ్చేసిందనే చెప్పాలి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా శ్రమిస్తున్నా కూడా కరోనా కట్టడి సాధ్యం కావడం లేదు. ఇలాంటి కీలక తరుణంలో అప్పుడెప్పుడో మానవాళిపై దాడి చేసిన సార్స్ వైరస్ అనుభవాలను కొందరు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. నాడు సార్స్ పై ఎంతమేర పోరు సాగించినా... అది కట్టడి కాకపోగా... తనకు తానుగానే నిష్క్రమించిన వైనం మాదిరే ఇప్పుడు కూడా కరోనా కూడా తనకు తానుగానే నిష్క్రమిస్తుందని కొందరు చెబుతున్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ వాదనలకు వారు చెబుతున్న కారణాలు కూడా ఆసక్తికరమేనని చెప్పక తప్పదు. ఈ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి.

‘సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌)’ పేరిట 2003లో మనపై దాడి చేసిన వైరస్ కూడా కరోనా మాదిరే ప్రాణాంతకమైనదే. అయితే అప్పట్లో ఇంత భయం లేదు, ఇంతటి ప్రజా ప్రతిష్టంభన లేదు. ఇప్పుడు కరోనా వైరస్‌కు లేనట్లే... నాడు సార్స్‌ నివారణకు కూడా వ్యాక్సిన్‌ లేదు. వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పెద్దగా ప్రయత్నాలు కూడా జరగలేదు. ఆ తర్వాత సార్స్ దానంతటదే అంతరించిపోయింది. మరి అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు?. సార్స్‌ కూడా కరోనా జాతికి చెందినదే. అందుకే సార్స్‌ను ‘సార్స్‌– కోవిడ్‌–1’ గాను, కరోనాను ‘సార్స్‌ కోవిడ్‌–2’ లేదా కోవిడ్‌–19’ గాను వ్యవహరిస్తున్నారు. సార్స్‌ కూడా చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో 2002, నవంబర్‌లో బయట పడింది. అప్పుడు కూడా సార్స్‌ గురించి వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా తెలియజేయలేదు. ఆ తర్వాత 2003, ఫిబ్రవరి నెలలో వియత్నాంలోని హనాయ్‌లో సార్స్‌ విస్తరించింది. అక్కడ సార్స్‌ కేసును ప్రత్యక్షంగా పరీక్షించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు, మార్చి 10వ తేదీ, 2003లో తన సంస్థకు తెలియజేశారు. అదే సమయంలో చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన డాక్టర్‌ ఒకరు హాంకాంగ్‌ వెళ్లి అక్కడి మెట్రోపాల్‌ హోటల్‌లో బస చేశారు. ఆయన ద్వారా ఆయనతో పాటు ఆ హోటల్‌లో బస చేసిన 12 మందికి సార్స్‌ సోకింది. వారిలో ముగ్గురు సింగపూర్‌కు, ఇద్దరు కెనడాకు, ఒకరు ఐర్లాండ్‌కు, ఒకరు అమెరికాకు, ఒకరు వియత్నాంకు వెళ్లారు. వారితోని ఆ దేశాల్లో సార్స్‌ విస్తరించింది. మరో నలుగురు హాంకాంగ్‌లో ఉండడంతో వారి ద్వారా అక్కడ కూడా వైరస్‌ విస్తరించింది.

రోగుల్లో సార్స్‌ లక్షణాలు రెండు, మూడు రోజుల్లోనే బయటపడేవి. సార్స్, కరోనా రెండు వైరస్‌లు కూడా గబ్బిళాల నుంచే మానవ జాతికి సంక్రమించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండింటి ఆర్ఎన్ఏ జన్యువుల మధ్య 80 శాతం పోలికలు ఉన్నాయట. మనుషులకు, చింపాజీల ఆర్ఎన్ఏ జన్యువుల మధ్య 98 శాతం పోలికలు ఉంటాయి. అయితే మనుషులకు, చింపాజీలకు మధ్య పోలికలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వైరస్‌ విషయంలో ఇది వేరుగా ఉంటాయట. జన్యువుల మధ్య పోలికలు 70 శాతం దాటితేనే సామీప్యం ఎక్కువగా ఉంటుందట. అటువంటిది సార్స్, కరోనా వైరస్‌ల ఆర్ఎన్ఏ జన్యువుల మధ్య 80 శాతం పోలికలు ఉన్నాయి. వాటి పైభాగంలో ఉండే ప్రాటీన్ల మధ్య కూడా తేడాలు లేవట. సార్స్‌ కేవలం మానవుల ఊపిరితిత్తులపైనే దాడి చేసి నిమోనియా జబ్బును కలుగ చేస్తుండగా, కరోనా ఊపిరితిత్తులతోపాటు ఇతర జన్యువులపై దాడి చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. సార్స్‌కు, కరోనాకు మధ్య మరో ప్రధానమైన తేడా ఉంది. సార్స్‌ నెమ్మదిగా ఒకరి నుంచి ఒకరి విస్తరించడంతోపాటు వాటి లక్షణాలు రోగిలో రెండు, మూడు రోజుల్లోనే బయటపడ్డాయి. కరోనా వైరస్‌ వేగంగా విస్తరించడంతోపాటు వాటి లక్షణాలు రోగిలో బయట పడటానికి ఐదారు రోజుల నుంచి 20 రోజుల వరకు పడుతోంది.

సార్స్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి ఎలుకలు, ఇతర జంతువుల వరకే పరిమితం అయ్యాయి. వ్యాక్సిన్ల వల్ల జంతువుల్లో రోగ నిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు వచ్చాయి. ఇంతలో వైరస్‌ దానంతట అదే కనిపించకుండా అదృశ్యమవడంతో వ్యాక్సిన్‌ ప్రయోగాలను నిలిపివేశారు. అప్పటికే ఎండలు తీవ్రమవడం వల్ల, రోగులను కచ్చితంగా క్వారెంటైన్‌లో ఉంచడం వల్ల సార్స్‌ జాడ లేకుండా పోయిందని వైద్య నిపుణులు భావించారు. వైరస్‌ల విషయంలో కచ్చితమైన కారణాలు చెప్పలేమని వారే అంటున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. అవి సత్ఫలితాలు ఇవ్వకముందే సార్స్‌ లాగా కరోనా కూడా అంతరించి పోయే అవకాశాలు ఉన్నాయని కొంత మంది వైద్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న వర్షాకాలంలో కరోనా రెండోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయంటూ వైద్యులు చేస్తున్న హెచ్చరికలను వారు ఖండిస్తున్నారు. వైరస్‌లకు భయపడి దూరంగా దాక్కునే బదులు, ఎదురొడ్డి పోరాడడమే (కలిసి సహజీవనం) నిజమైన పరిష్కారమని ఆ కొంత మంది వైద్యులు ప్రత్యేక వాదనను వినిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ను విడతల వారిగా సడలించేందుకు ప్రయత్నాలు జరగుతున్న నేపథ్యంలో సార్స్‌లాగా, కరోనా కూడా దానంతట అదే అదృశ్యమైతే అంతకన్నా అదృష్టం ఏముంటుంది?