Begin typing your search above and press return to search.

ఏపీలో ఇంత దుబారా చేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   24 July 2021 1:40 PM GMT
ఏపీలో ఇంత దుబారా చేస్తున్నారా ?
X
ఏపీ ఆర్థిక ప‌రిస్థితి అస‌లే అంతంత మాత్రం. ఈ ప‌రిస్థితుల్లో ఏ మాత్రం కూడా దుబారా లేకుండా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. కానీ ఏపీ ప్ర‌భుత్వానికి ఒకరు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 50 మంది స‌ల‌హాదారులు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా ఈ స్థాయిలో స‌ల‌హాదారులు లేరు. ఏపీలో ఆ శాఖ‌... ఈ శాఖ అని తేడా లేకుండా ఎడాపెడా స‌ల‌హాదారుల‌ను పెట్టి ప‌డేశారు.

ఈ స‌ల‌హాదారుల‌కు ప్ర‌భుత్వం నుంచి భారీగా జీత‌ భ‌త్యాలు, అద‌న‌పు సౌక‌ర్యాలు, అల‌వెన్సులు వెళుతున్నాయి. ఇలా ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కావ‌డంపై ఏపీ హైకోర్టు విస్మ‌యం వ్య‌క్తం చేసింది. ప్ర‌జాధ‌నం ఇలా ఎందుకు ఖ‌ర్చు పెడుతున్నారంటూ ప్ర‌శ్నించింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేప‌థ్యంలో అది ప‌ట్టించుకోకుండా ఇంత‌మంది స‌ల‌హాదారుల‌ను ఎలా పెట్టుకుంటార‌ని విస్మ‌యం వ్య‌క్తం చేయ‌డంతో పాటు గ‌తంలో స‌ల‌హాదారులు రాజ‌కీయాలు మాట్లాడేవారు కాద‌ని.. అయితే ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని కూడా వ‌క్కాణించింది.

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నీలం సాహ్నీ నియామ‌కాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిస‌న్‌పై వాద‌న‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంగా హైకోర్టు పై సందేహాల‌ను లేవ‌నెత్తింది. నీలం సాహ్నీ ఎన్న్ఇక‌ల క‌మిష‌న‌ర్‌గా అన‌ర్హురాలు అని పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాదులు వాదిస్తే... ప్ర‌భుత్వం త‌ర‌పున న్యాయ‌వాదులు మాత్రం ఐఏఎస్ అధికారులుగా చేసిన వారు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లుగా ప‌నిచేయ‌డం గ‌తంలో కూడా సంప్ర‌దాయ బ‌ద్ధంగా వ‌స్తోంద‌ని వాదించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వానికి ఉన్న 50 మంది స‌ల‌హాదారుల ప్ర‌స్తావ‌న‌ను కూడా కోర్టు తెచ్చింది.

అయితే దీనిపై కూడా ప్ర‌భుత్వం త‌ర‌పున న్యాయ‌వాది స‌ల‌హాదారుల గురించి ఏ చ‌ట్టంలో లేద‌ని.. ప్ర‌భుత్వ అస‌వ‌రాల మేర‌కే వారిని నియ‌మించుకోవ‌చ్చ‌ని... దీనిని ప్ర‌జాధ‌నం వృథా అనే కోణంలో చూడ‌డానికి వీల్లేద‌ని చెప్పుకోవ‌డంంతో సామాన్య జ‌నాలు సైతం విస్తుపోతున్నారు. ఇక ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎలాగూ ఉంటాయి. అది ప‌క్క‌న పెడితే ఇంత మంది స‌ల‌హాదారులు, వారి జీత‌భ‌త్యాలు, ఇత‌ర అల‌వెన్సుల‌తో ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీగా చిల్లుప‌డుతోంది. ఓ వైపు సంక్షేమం పేరుతో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చ‌యిపోతున్నాయి. ఏపీలో అభివృద్ధి అనే మాట వినిపించ‌డం లేద‌ని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌ద‌వుల పేరుతో ఇంత మందికి.. ఇన్నేసి కోట్లు ధార‌బోస్తే రాష్ట్రం గ‌తి ఏమ‌వుతుంద‌న్న ఆందోళ‌న ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంది. ఎక్క‌డైనా ఒక‌రిద్ద‌రు స‌ల‌హాదారుల‌ను చూశాం.. కానీ ఇంత మంది స‌ల‌హాదారులు ఏంట్రా బాబోయ్ అన్నది స‌గ‌టు మ‌నిషికి కూడా అర్థం కావ‌డం లేదు.