Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వాసులకు శాపంగా మారిన ‘చలిగాలి’

By:  Tupaki Desk   |   4 Feb 2021 1:30 AM GMT
హైదరాబాద్ వాసులకు శాపంగా మారిన ‘చలిగాలి’
X
ఇతర మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ వాతావరణం విలక్షణంగా ఉండటమే కాదు.. చాలామంది ఇట్టే ఇష్టపడిపోతారు. సమశీతోష్ణస్థితితో పాటు.. సాయంత్రం అయితే చాలు.. చల్లటి గాలులతో మనసును ఊరించే హైదరాబాద్ చలిగాలికి సంబంధించిన షాకింగ్ నిజాన్ని వెల్లడించిందో తాజా అధ్యయనం.

చలిగాలిలో వాయు కాలుష్యం తీవ్రతచాలా ఎక్కువగా ఉందన్న విషయాన్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ నివేదిక ఒకటి వెల్లడించింది. 2019తో పోలిస్తే 2020లో చలిగాలిలో 7.5 శాతం మేర వాయు కాలుష్యం పెరిగినట్లుగా తేలింది. హైదరాబాద్ లోని ఆరు ప్రాంతాల్లో గాలి నాణ్యతను తెలిపే కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా హైదరాబాద్ నగరంలోని గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవటంతో పాటు.. ఆయా వర్గాలకు సమాచారాన్ని అందిస్తారు. దీంతో.. చర్యలు చేపట్టే వీలుంది.

తాజాగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. దక్షిణాది రాష్ట్ర రాజధానులైన చెన్నై.. బెంగళూరు.. తిరువనంతపురం కంటే ఎక్కువగా హైదరాబాద్ లో గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ లో సేకరించిన డేటా ప్రకారం సనత్ నగర్ లో అత్యధిక వాయు కాలుష్యం ఉన్నట్లుగా తేలింది. సెంట్రల్ యూనివర్సిటీలో అత్యల్పంగా వాయు కాలుష్యం నమోదైంది. గాలిలోని కాలుష్య స్థాయి విషయానికి వస్తే.. చెన్నైలో 33.. బెంగళూరులో 30.. తిరువనంతపురంలో 25 ఉండగా.. హైదరాబాద్ లో అత్యధికంగా 36 ఉన్నట్లుగా గుర్తించారు.

చలిగాలి కారణంగా వాయు కాలుష్యం తీవ్రత పెరగటంతో పాటు.. దీనికి చెక్ పెట్టే చర్యలు తీసుకోకుంటే.. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారి ఆరోగ్యం మరింతగా క్షీణించే అవకాశం ఉందంటున్నారు. జనవరి మొదటి వారాన్ని డర్టీయెస్ట్ వీక్ గా అభివర్ణించిన సీఎస్సీ నివేదిక.. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న మరిన్ని ప్రాంతాల గురించి వెల్లడించింది. దాని ప్రకారం అమరావతి.. రాజమహేంద్రవరం.. చిక్ బళ్లాపూర్.. యాద్గిర్ లో ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది. చలిగాలి ఎక్కువగా ఉన్నప్పుడు.. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.