Begin typing your search above and press return to search.

అమెరికాపై మంచు దుప్పటి.. ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా

By:  Tupaki Desk   |   30 Jan 2022 1:21 PM GMT
అమెరికాపై మంచు దుప్పటి.. ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా
X
అగ్రరాజ్యం అమెరికాపై మంచుదుప్పటి కప్పుకుంది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచు దర్శనమిస్తోంది. రహదారులపై రెండు అడుగుల మేర పేరుకుపోయింది. రోడ్లు అతి ప్రమాదకరంగా మారాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది. అమెరికాలోని న్యూయార్క్, అట్లాంటిక్, బోస్టన్ ఫిలడెల్ఫియాలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. హిమపాతం తో పాటు శీతగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు.

మంచు తుఫాను తీవ్రతరం కావడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆదేశించింది. ఓవైపు మంచు, మరోవైపు చల్లటి గాలుల నేపథ్యంలో స్నో ఎమర్జెన్సీ ప్రకటించింది. పార్కులను మూసివేయాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగడాన్ని నిషేధించింది. ఇకపోతే వాతావరణం సహకరించకపోవడం వల్ల పలు విమానాలు సైతం రద్దయ్యాయి. దాదాపు నాలుగు వేల విమానాలను రద్దు చేస్తూ ఆయా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

శుక్రవారం సాయంత్రం నుంచి శీతల గాలుల ప్రభావం అధికంగా ఉంది. కరోలినాస్, అప్పలాంచియా ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో మంచు పేరుకుపోయింది. మాన్ హాటన్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ లో దాదాపు 25 సెంటీ మీటర్ల మంచు పేరుకుందని అక్కడి అధికారులు ప్రకటించారు. సమీప ప్రాంతాల్లోనూ 30 సెంటిమీటర్ల మేర ఉందని తెలిపారు. కాగా ఈ స్నో ఎమర్జెన్సీపై ఆ దేశంలోని ఆయా రాష్ట్రాలు రక్షణ చర్యలు చేపట్టాయి. తీవ్రతను బట్టి నిబంధనలు అమలు చేస్తున్నాయి.

భారీ మంచు తుఫాను కారణంగా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లమీద మంచు పేరుకుపోవడంతో రవాణా స్తంభించింది. ఆ మంచు దుప్పటి మీద ప్రయాణం చేయలేక జనం ప్రయాణాలను మానుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కాగా ఇలాంటి తుఫాన్ వర్జీనియాలో ఇటీవలె దాడి చేసింది. జనవరి మొదటి వారంలో మంచు అల్లకల్లోలం సృష్టించింది. ఈ భారీ హిమపాతంతో అమెరికా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.