Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖుల‌కు ఇదేం పోయే కాలం..మార్కుల గొప్ప‌లు అవ‌స‌ర‌మా?

By:  Tupaki Desk   |   3 May 2019 6:12 AM GMT
ప్ర‌ముఖుల‌కు ఇదేం పోయే కాలం..మార్కుల గొప్ప‌లు అవ‌స‌ర‌మా?
X
ప‌రీక్ష‌ల్లో వ‌చ్చే మార్కులే ఒక వ్య‌క్తి తెలివికి.. బుద్ధి కుశ‌ల‌త‌కు గీటురాయా? అంటే కాద‌నే చెబుతారు. ప‌రీక్ష‌ల్లో వ‌చ్చే మార్కుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం త‌ప్పు కాదు. కానీ.. దానికో ప‌రిమితి ఉంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మార్కులు.. ర్యాంకుల రేసులో ప‌డి.. పిల్ల‌ల్ని స్కూళ్ల‌కు.. కాలేజీల‌కు పంపే బ‌దులు.. మార్కులు ఉత్ప‌త్తి చేసే క‌ర్మాగారాల‌కు పంపుతున్న వైనం గ‌డిచిన కొన్నేళ్లుగా సాగుతున్న‌దే.

విద్యార్థి జీవితంలో ప‌రీక్ష‌లు.. మార్కులు కీల‌క‌మే అయినా.. వాటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్య‌త మాత్ర‌మే ఇవ్వాలి. అంతుకు మించిన హ‌డావుడి చేస్తే.. ఒత్తిడి పెరుగుతుంది. ఈ కార‌ణంతోనే.. 99 శాతం మార్కులు వ‌చ్చిన విద్యార్థులు సైతం అసంతృప్తిగా ఉంటాన్ని చూస్తున్నాం. 99శాతం మార్కులు వ‌చ్చిన పిల్ల‌లు అసంతృప్తితో ఉండ‌టాన్ని.. ఆవేద‌న‌కు గురి కావ‌టాన్ని గొప్ప‌గా చెప్పుకునే పేరెంట్స్ మ‌న చుట్టూ క‌నిపిస్తారు.

మార్కుల‌తో కాకుండా.. క్యారెక్ట‌ర్ విష‌యంలో త‌మ పిల్ల‌లు ఎలా ఉన్నార‌న్న విష‌యాన్ని స‌మ‌కాలీన ప్ర‌పంచంలో త‌ల్లిదండ్రులు పట్టించుకోక‌పోవ‌టం అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో.. మార్కులు వ‌స్తే ఆనందం.. రాకుంటే ఆత్మ‌హ‌త్య‌లన్న ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా సీబీఎస్సీ రిజ‌ల్ట్ విడుద‌ల‌య్యాయి. మ‌న‌కు ఇంట‌ర్ ఎలానో.. సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ వారు ప్ల‌స్ టూగా అభివ‌ర్ణిస్తారు.

తాజాగా విడుద‌లైన ఫ‌లితాల్లో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ ఇంట ఆనందం అంతా ఇంతా కాద‌న్న‌ట్లుంది. ఎందుకంటే.. వారి పిల్ల‌లు మంచి మార్కుల‌తో పాస్ అయ్యార‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి చేస్తున్న హ‌డావుడి మామూలుగా లేదు.

కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ 96.4 శాతం మార్కులు వ‌చ్చిన వైనంపై కేజ్రీవాల్ స‌తీమ‌ణి ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఇక‌.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ ఆనందానికి హ‌ద్దుల్లేవు. ఆమె కుమారుడు జోహ‌ర్ 91 శాతం మార్కులు సాధించిన దానిపై ఆనందం వ్య‌క్తం చేశారు. కేజ్రీవాల్ స‌తీమ‌ణి విద్యావంతురాలు. అలాంటి ఆమె కూడా కొడుక్కి వ‌చ్చిన మార్కుల గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌టాన్ని ఏమ‌నాలి?

పిల్ల‌లు సాధించిన విజ‌యాన్ని న‌లుగురితో పంచుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. తాము చేసే ట్వీట్లు.. చుట్టూ ఉన్న స‌మాజాన్నిప్ర‌భావితం చేస్తాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. పిల్ల‌లు పాస్ అయితే.. వారి జీవితంలో సాధించిన గెలుపును ప్ర‌స్తావించి.. వారికి ఆల్ ద బెస్ట్ చెప్ప‌టం లాంటివి చేయాలి. అంతేకానీ.. మా అబ్బాయికి ఎన్ని మార్కులు వ‌చ్చాయో తెలుసా? అంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌టాన్ని ఏమ‌నాలి?

ఇలాంటి తీరు.. మార్కుల మీద మ‌రింత మోజును పెంచ‌ట‌మేకాదు.. విద్యార్థుల‌కు త‌ల్లిదండ్రుల నుంచి మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ప్ర‌ముఖులు సైతం మార్కుల మ‌త్తులో ప‌డిపోవ‌టం.. పిల్ల‌ల‌కు వ‌చ్చిన మార్కుల్ని గొప్ప‌గా ప్ర‌చారం చేసుకోవ‌టం చేస్తే.. సామాన్యులు త‌మ పిల్ల‌ల‌కు మార్కులు రాక‌పోవ‌టాన్ని సీరియ‌స్ గా తీసుకొని.. అదే ప‌నిగా నిందించ‌టం.. ఒత్తిడి పెంచ‌టం లాంటివి చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదేమో?

పిల్ల‌ల మీద త‌మ‌కున్న ప్రేమాభిమానాల్ని తల్లిదండ్రులు ప్ర‌క‌టించ‌టం త‌ప్పు కాదు. కానీ.. ఆ విష‌యంలో సంయ‌మ‌నం అవ‌స‌రం అన్న‌ది చాలా ముఖ్యం. ప్ర‌ముఖులు తాజాగా చేసిన సోష‌ల్ పోస్టుల్లో మార్కుల్ని ప్ర‌ముఖంగా ఫోక‌స్ చేసే కంటే.. ప్ల‌స్ టూ పూర్తి అయ్యింది.. వారి జీవితంలో మ‌రిన్ని విజ‌యాలు రావాలి.. ఆ దిశ‌గా మ‌రింత కృషి చేయాల‌న్న మాట‌లు ఉంటే బాగుండేది. పిల్ల‌ల్ని మార్కులు సాధించే యంత్రాలుగా చూసుడేంది?