Begin typing your search above and press return to search.

ఆ మహిళ చెంప మీద చర్మ కేన్సర్..ప్రపంచంలో తొలిసారి గుర్తింపు

By:  Tupaki Desk   |   3 May 2023 4:37 PM GMT
ఆ మహిళ చెంప మీద చర్మ కేన్సర్..ప్రపంచంలో తొలిసారి గుర్తింపు
X
ముప్ఫై ఏళ్ల క్రితం కేన్సర్ అన్నది చాలా అరుదుగా వినిపించేది. కేన్సర్ వచ్చిందన్నంతనే ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి.. కేన్సర్ అన్నంతనే ఉలిక్కి పడటం మామూలే అయినా.. గతంతో పోలిస్తే.. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కాకుంటే.. జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా.. చాలా తరచుగా కేన్సర్ కేసుల గురించి వినటం జరుగుతోంది. తాజాగా ప్రపంచంలోనే అతి అరుదైన ఒక చర్మ కేన్సర్ ను గుర్తించారు.

దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మెడికల్ జర్నల్ఆఫ్ ఆంకాలజీ 1990- 2016 మధ్య చేసిన ఒక సర్వేలో కేన్సర్ కేసుల పెరుగుదల స్పష్టంగా అర్థమయ్యేలా ఉంది. దీని బారిన పడిన వారి మరణాలు ఎంతగా పెరిగాయన్న విషయాన్ని ఈ నివేదికవెల్లడించింది. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అతి చిన్న చర్మ కేన్సర్ ఉదంతాన్ని సైతం గుర్తించారు. అమెరికాకు చెందిన ఒక మహిళ ముఖం మీద ఉన్న కేన్సర్ ను గుర్తించిన వైనం షాకింగ్ గా మారింది. చెంప మీద ఉన్న మచ్చ 0.65 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఉండటం గమనార్హం.

చాలా ఏళ్లుగా కంటి కింద ఎర్రటి మచ్చతో ఇబ్బందిపడుతున్న క్రిస్టీస్టాట్స్ అనే మహిళ చర్మవ్యాధుల నిపుణుడ్ని సంప్రదించారు. ఈ సందర్భంగా సదరు మహిళ చెప్పిన ఎర్రటి మచ్చను పరిశీలించే క్రమంలో.. అదే కుడి చెంప మీద మరో మచ్చనుకూడా గుర్తించారు.

అయితే.. ఈ మచ్చ కంటికి కనిపించనంత చిన్న మచ్చ కావటం గమనార్హం. అయితే.. ఆమె చెంపను నిశితంగా పరిశీలించే క్రమంలో ఈ మచ్చను గుర్తించారు. షాకింగ్ విషయం ఏమంటే.. ఈ మచ్చ ప్రాణాంతకమైన చర్మ కేన్సర్ మెలనోమాగా నిర్దారించారు.

లక్కీగా సదరు కేన్సర్ కణాలు చెంప మీద ఉన్న మచ్చ వరకే పరిమితం అయ్యాయని.. ఇంకా ఇతర భాగాలకు వ్యాపించలేదన్న విషయాన్ని గుర్తించారు. శరీరంలో ఇతర భాగాలకువ్యాపించటానికి ముందే దాన్ని గుర్తించటంతో చికిత్స సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ తరహా చర్మ కేన్సర్ చాలా అరుదైనదిగా చెబుతున్నారు. డెర్మోస్కోపీ, రిఫ్లక్టెన్స్ కాన్‌ఫోకల్ మైక్రోస్కోపీలను ఉపయోగించి ఈ మచ్చను కనుగొన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇంతకూ సదరు మచ్చను గుర్తించాలన్న ఆలోచన బాధిత మహిళకు ఎందుకు వచ్చిందన్న సందేహం ఎవరికైనా రావొచ్చు. దానికి సదరు మహిళ చెబుతూ.. కొవిడ్ సమయంలో తన ఆరోగ్యం గురించి ఆలోచించటం మొదలుపెట్టినట్లుగాచెప్పిన ఆమె.. బాత్రూంలోని అద్దంలో తన మచ్చను మొదటిసారిగా గుర్తించినట్లు వెల్లడించారు. అది అంతకంతకూ పెరుగుతున్న తీరుతో ఆందోళన చెంది.. చర్మ వ్యాధి నిపుణుడ్ని సంప్రదించే వరకు వెళ్లింది.

సరైన సమయానికి సరైన చోటుకు తాను వచ్చినట్లుగా ఆమె చెబుతున్నారు. ఈ కేసు వివరాల్ని అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన జర్నల్ లో ప్రచురించారు. ఈ వచ్చనకు తాజాగా గిన్నిస్ రికార్డు సైతం దక్కుతుందని చెబుతున్నారు. ఈ వివరాలు తెలిసినంతనే ఆందోళనకు గురయ్యేలా ఉన్న వేళ.. దాన్ని ఫేస్ చేసిన సదరు మహిళ మానసిక పరిస్థితి మరెలా ఉంటుందో కదా?