Begin typing your search above and press return to search.

రిమోట్‌ కారుతో రోడ్డుపైకి బుడతడు..

By:  Tupaki Desk   |   27 Feb 2019 10:23 AM GMT
రిమోట్‌ కారుతో రోడ్డుపైకి బుడతడు..
X
ఇదీ బిజీ కాలం.. దంపతులిద్దరూ ఉద్యోగాలకు వెళుతుండడంతో వారి పిల్లల బాగోగులను చూసుకునేవారే కరువుతున్నారు. కాలానుగుణంగా మార్పులు.. దాంతో పాటు అవసరాలు పెరుగుతుండడంతో సంపాదనలో పడి కొందరు తమ పిల్లల గురించి మరిచిపోతున్నారు. తాజాగా ఓ పిల్లాడు ఇంట్లో వాళ్లను విడిచి రోడ్డుపైకి రావడం కలకలం రేపింది. అదీ తన బొమ్మకారును నడుపుకుంటూ సాధారణ వాహనాల వలే రోడ్డుమీదకు వచ్చాడు ఓ బుడతడు. కారు ఒంటరిగా నడుపుకుంటూ రావడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం వాహనాలతో రోడ్డు బిజీగా ఉంటుంది. మాములు వాహనాల మీద వెళ్లాలంటేనే ప్రజలు జంకుతారు. అలాంటి బిజీగా ఉన్న ఓ రోడ్డుపై బుడతడు బొమ్మకారుతో షికారు కొట్టాడు. నగరంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బెంజి సర్కిల్‌ వైపు రోడ్డు మీదుగా ఓ పిల్లాడు బ్యాటరీ కారు నడుపుకుంటూ బయటకు వచ్చాడు. అంతేకాకుండా ఓ భారీ వాహనాన్ని ఓవర్‌టేక్‌ కూడా చేయడం అందరినీ విస్మయపరిచింది..

ఆ పిల్లాడిని చూసిన వారందరూ తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేశారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ బుడతడి వద్దకు వచ్చి ఎవరంటూ మెల్లిగా అడిగాడు. అంతలోపే చిన్నారి నాయనమ్మ మనవడి కోసం వెతుక్కుంటూ వచ్చింది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆపిన చిన్నారిని చూసి నాయనమ్మకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లయింది.

ఆ తరువాత కానిస్టేబుల్‌ వివరాలు అడగగా పీ అండ్‌ టీ కాలనీకి చెందిన శ్రావణ్‌ కుమారుడు శ్రీరామ్‌ అని తేలింది.. నాలుగేళ్లున్న ఆ చిన్నారి ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఎల్‌ కేజీ చదువుతున్నాడు. కాలికి దెబ్బ తగలడంతో ఆరోజు స్కూలుకు వెళ్లలేదు. దీంతో ఇంట్లోనే ఉన్న పిల్లాడు బ్యాటరీ కారుతో ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం ఆ పిల్లాడి తల్లిదండ్రులను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పిల్లాడిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.