Begin typing your search above and press return to search.

సీఎం అభ్యర్థిపై రెండు చెప్పులు పడితే.. రియాక్షన్ ఏమంటే?

By:  Tupaki Desk   |   21 Oct 2020 7:10 AM GMT
సీఎం అభ్యర్థిపై రెండు చెప్పులు పడితే.. రియాక్షన్ ఏమంటే?
X
రాజకీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పూలబాట కానే కాదు. అనుక్షణం సవాళ్లు ఎదురుకావటమే కాదు.. తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. తమ తప్పు లేకున్నా.. కొందరిఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజా జీవితంలో అప్పుడప్పడు అవమానాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిని దిగమింగుకొని పోరాడినప్పుడే విజయం సొంతమవుతుంది. తాజాగా జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆర్జేడీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిని తాజాగా ఎదుర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నాడు. వేదిక మీదకు వచ్చి కూర్చున్న ఆయన్ను చూసినంతనే ఆయన మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ.. పెద్ద ఎత్తున అనుకూల నినాదాలు చేశారు. ఇలాంటి ఉత్సాహభరిత సమయంలో ఊహించని విధంగా రెండు చెప్పులు సూటిగా ఆయన వైపు దూసుకొచ్చాయి. ఒక చెప్పు ఆయన తల పైభాగం నుంచి వెళితే.. రెండో చెప్పు నేరుగా ఆయన ఒళ్లో పడింది.

అయినప్పటికి ఎలాంటి ఆవేశానికి గురి కాకుండా.. ఆ మాటకు వస్తే..జరిగిన చేదు అనుభవాన్ని ప్రస్తావించకుండా తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. హుందాగా వ్యవహరించటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో.. ఒక పార్టీ సీఎం అభ్యర్థిగా వ్యవహరిస్తున్న నేత హాజరయ్యే సభకు సరైన భద్రతా చర్యలు చేపట్టరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక.. తేజస్వి యాదవ్ పైకి చెప్పువిసిరింది ఎవరన్న విషయాన్ని గుర్తించలేదు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్న నేపథ్యంలో పార్టీ బాధ్యతల్ని స్వీకరించి.. ఎన్డీయే కూటమితో పోరాడుతున్నారు. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు వెలువడిన అంచనాల ప్రకారం.. ఎన్డీయే కూటమే అధిక్యతలో ఉన్నట్లుగా చెబుతున్నారు.