Begin typing your search above and press return to search.

'స్కైరూట్' సింఫుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. భారతీయ 'స్పేస్ ఎక్స్'

By:  Tupaki Desk   |   26 Nov 2022 9:39 AM GMT
స్కైరూట్ సింఫుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. భారతీయ స్పేస్ ఎక్స్
X
'స్పేస్ ఎక్స్'.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సంస్థ. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ను మరో స్థాయికి తీసుకెళ్లటంలో ఈ సంస్థ కీ రోల్ ప్లే చేసింది. సరిగ్గా ఆ సంస్థ స్థాయి కాకున్నా.. అలాంటి విజన్ తో పని చేస్తూ.. ఇప్పటికే తన తొలి విజయాన్ని సొంతం చేసుకున్న సంస్థగా దీన్ని చెప్పాలి. ఇప్పటివరకు దేశీయంగా రాకెట్ ప్రయోగాలన్ని కూడా భారతీయ అంతరిక్ష సంస్థ మాత్రమే చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా తొలిసారి హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు కంపెనీ 'స్కైరూట్' తన రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించటం తెలిసిందే.

ఈ సంస్థకు ఇద్దరు భాగస్వాములు కాగా.. వారిద్దరు తెలుగు వారే. సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు పవన్ కుమార్ చందన. మీడియాకు దూరంగా ఉండే ఈ సంస్థ భాగస్వాములు తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు తమ గురించి.. తమ సంస్థ లక్ష్యాల గురించి మాట్లాడారు. తమ సంస్థ విజన్ గురించి.. రాబోయే రోజుల్లో తాము చేయబోయే ప్రయోగాల గురించి.. అందుకు సంబంధించిన లక్ష్యాల గురించి విన్నప్పుడు.. ఈ సంస్థ త్వరలోనే అందరి నోట్లో నానటం ఖాయమన్న భావన కలుగుతుంది.

2018 జూన్ లో స్థాపించిన ఈ సంస్థ కేవలం నాలుగేళ్ల వ్యవధిలో తమ సొంత రాకెట్ ను ప్రయోగించటం.. అది కాస్తా విజయవంతం కావటం గమనార్హం. తాము ప్రయోగించిన విక్రమ్ ఎస్ రాకెట్ లాంచింగ్ ప్రారంభం మాత్రమేనని చెబుతున్నారు. తాము తయారు చేసిన రాకెట్ కు భూమి మీద నుంచి 120కి.మీ. వరకు పైకి వెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ.. 80 కిలో మీటర్ల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించామని.. అనూహ్యంగా అది కాస్తా 89.5 కిలో మీటర్ల వరకు చేరినట్లుగా పేర్కొన్నారు.

విక్రమ్ సిరీస్ లో భాగంగా రానున్న రోజుల్లో విక్రమ్ 1, 2, 3 పేరుతో రాకెట్లను ప్రయోగించనున్నట్లుగా చెప్పారు. తమ తదుపరి ప్రయోగమైన విక్రమ్ 1ను 2023 అక్టోబరులో ప్రయోగించనున్నారు. అంతరిక్ష రంగంలో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయని.. కేవలం ఐదు దేశాలు మాత్రమే అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్న విషయాన్ని ప్రస్తావించాడు. ఒక్క రాకెట్ లాంచింగ్ మార్కెట్టే ప్రస్తుతానికి 10 బిలియన్ డాలర్లుగా ఉంటే.. భారత్ వాటా రెండు శాతం కంటే తక్కువన్నారు. రానున్న పదేళ్లలో 10 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు. 2025 - 26 నాటికి రాకెట్ లాంచింగ్ మార్కెట్ 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెప్పటం గమనార్హం.

తాము తయారు చేయనున్న విక్రమ్ -1 రాకెట్ ను 24 గంటల్లో అసెంబుల్ చేసి ఏ లాంచింగ్ నుంచైనా ప్రయోగించే వీలుందని.. అదే సమయంలో విక్రమ్ 2, 3 లలో రాకెట్లను 72గంటల్లో లాంచ్ చేసేలా ప్లాన్ చేయొచ్చని చెబుతున్నారు. 2025 చివరి నాటికి నెలకు కనీసం రెండు రాకెట్లను ప్రయోగించటమే తమ టార్గెట్ గా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాకెట్లలో మళ్లీ మళ్లీ వినియోగించుకోవటానికి వీలైన ఇంజిన్లను డెవలప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇద్దరు తెలుగువాళ్లు మొదలు పెట్టిన స్కైరూట్ సంస్థ.. రానున్న రోజుల్లో భారతీయ స్పేస్ ఎక్స్ మాదిరి మారాలని ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.