Begin typing your search above and press return to search.

తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ .. నిరుద్యోగ యువతకి శుభవార్త చెప్పిన సీఎం

By:  Tupaki Desk   |   19 Dec 2019 6:46 AM GMT
తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ .. నిరుద్యోగ యువతకి శుభవార్త చెప్పిన సీఎం
X
ఏపీలో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . డిగ్రీలు పూర్తి చేసినా సరైన స్కిల్స్ లేక ఉద్యోగం రాక, నిరుద్యోగులుగా మిగిలి పోతున్న ఎంతోమంది కోసం జగన్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధిని విస్తృతం చేయడం ద్వారా ఉపాథి కల్పనకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తిరుపతి లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అధికారులకు నిర్దేశించారు. వీటన్నింటినీ విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనివల్ల ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. సమీక్ష, పర్యవేక్షణ సులభతరమవుతుందని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలనే అంశాన్ని స్కిల్స్ యూనివర్శిటీ నిర్ణయిస్తుందన్నారు. ఏయే కేంద్రాల్లో ఏ తరహా శిక్షణ అందుబాటులో ఉందనే దానిపై విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందని చెప్పారు. దీనివల్ల ఓ పటిష్టమైన వ్యవస్థను రూపొందించ వచ్చన్నారు.

ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల అవసరమైతే రెండింటిని నెలకొల్పాలనే యోచనతో ఉన్నట్లు తెలిపారు. ఎంపిక చేసుకున్న ఈ పాలిటెక్నిక్ కాలేజీని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చాలన్నారు. వీటి అనుసంధానానికి ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు కావాలన్నారు. వివిధ సాంకేతిక కోర్సులను అభ్యసించే వారికి మరింత నైపుణ్యాన్ని వీటి ద్వారా అందించ గలమన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లమో చదివిన వారికి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు ఈ స్కిల్స్ యూనివర్శిటీ, స్కిల్స్ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పారు. వచ్చే సమావేశం నాటికి పార్లమెంట్‌కు ఒక పాలిటెక్నిక్ కాలేజీని గుర్తించాలని ఆ కళాశాలలో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

అలాగే మనం ఇచ్చే నైపుణ్య శిక్షణ ఉద్యోగం వచ్చేలా ఉండాలి ..మంచి మౌలిక సదుపాయాలు కల్పించి, మంచి బోధకులను రప్పించాలి. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో అనుసంధానం కావాలి. ఉదాహరణకు కారు రిపేరులో శిక్షణ ఇవ్వాలనుకుంటే మెర్సిడెజ్‌ బెంజ్‌తో శిక్షణ ఇప్పించాలి. దీనివల్ల నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఇచ్చే శిక్షణకు ప్రపంచ దేశాల్లో మంచి విలువ ఉంటుంది అని సీఎం జగన్‌ చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అనేది ఒక స్కాంగా మిగిలి పోకుండా, ఒక అర్థం తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 2100 చోట్ల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు వివరించగా, వాటిపై పూర్తి స్థాయి సమీక్ష చేయాలని అధికారులకు సూచించారు.