Begin typing your search above and press return to search.

ఉమ్మ‌డి పౌర‌స్మృతి ఇప్ప‌ట్లో లేన‌ట్లే!

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:17 AM GMT
ఉమ్మ‌డి పౌర‌స్మృతి ఇప్ప‌ట్లో లేన‌ట్లే!
X
ఒకే దేశం.. ఒకే పౌరులు.. మ‌రి అలాంట‌ప్పుడు భిన్న‌మైన చ‌ట్టాలుఎందుకు? మ‌తాల ఆధారంగా కాకుండా.. ఒకే దేశం.. ఒకే ప్ర‌జ‌లు.. ఒకే చ‌ట్టం అన్న పేరుతో తెర మీదుకు తీసుకొచ్చిన ఉమ్మ‌డి పౌర‌స్మృతి కొద్దికాలం పాటు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్ల‌నుంది. మైనార్టీ వ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఉమ్మ‌డి పౌర‌స్మృతి అంశాన్ని కొద్ది కాలం పాటు బ‌య‌ట‌కు తీసుకొచ్చే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.

దీనికి కార‌ణంగా 21వ న్యాయ‌క‌మిష‌న్ ఛైర్మ‌న్ బీఎస్ చౌహాన్ కార‌ణంగా చెబుతున్నారు. ఈ నెలాఖ‌రు నాటికి ఆయ‌న రిటైర్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ అంశాన్ని కొంత కాలంగా తెర మీద‌కు తీసుకురాలేర‌ని చెబుతున్నారు. గిరిజ‌న ప్రాంతాల్లో వ్య‌క్తిగ‌త చ‌ట్టాల‌కు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుండ‌గా.. ఉమ్మ‌డి పౌర‌స్మృతిపై వెన‌క్కి త‌గ్గ‌టానికి కార‌ణంగా మారింది.

తాజా ప‌రిస్థితుల్లో ఉమ్మ‌డి పౌర‌స్మృతి కంటే కూడా.. వ్య‌క్తిగ‌త చ‌ట్టాల స‌వ‌ర‌ణ మీద‌నే న్యాయ‌ క‌మిష‌న్ దృష్టి సారించ‌నుంద‌ని చెబుతున్నారు. ఉమ్మ‌డి పౌర‌స్మృతి అత్యంత క్లిష్ట‌మైన‌.. సున్నిత‌మైన అంశం కావ‌టంతో.. ఇప్పుడున్న త‌క్కువ స‌మ‌యంలో దాన్ని ఏమీ చేయ‌లేమ‌న్న భావ‌న‌తో క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆ ప్రతిపాద‌న‌ను తెర మీద‌కు తీసుకురాలేద‌ని చెబుతున్నారు.

క‌మిష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వీ కాలం ముగుస్తున్న నేప‌థ్యంలో మిగిలిన కాస్త గ‌డువులో తాము ఉమ్మ‌డి పౌర‌స్మృతిని తీసుకురాలేమ‌ని క‌మిష‌న్ పేర్కొంది. ఉమ్మ‌డి పౌర‌స్మృతి సాధ్యం కాద‌ని.. మ‌తాల‌వారీగా కుటుంబ చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ సిఫార్సు చేయ‌నున్న‌ట్లు క‌మిష‌న్ ఛైర్మ‌న్ పేర్కొన‌టం గ‌మ‌నార్హం. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి అంశం ఇప్ప‌ట్లో తెర మీద‌కు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెప్పాలి.