Begin typing your search above and press return to search.

చేవెళ్ల చెల్లెమ్మ సహా ఆరుగురు టీఆరెస్‌ లోకి జంప్?

By:  Tupaki Desk   |   12 Jan 2019 5:16 AM GMT
చేవెళ్ల చెల్లెమ్మ సహా ఆరుగురు టీఆరెస్‌ లోకి జంప్?
X
కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ సంగతేమో కానీ తెలంగాణలో మరో అంశం రాజకీయంగా హాట్ టాపిగ్గా మారుతోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ హోంమంత్రి - రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు పేర్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని - ఆ తరువాత మరో నలుగురైదుగురు రెండో విడతలో టీఆర్ ఎస్‌ లో చేరతారని చెబుతున్నారు.

మొదటి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని - ఏ కారణం వల్ల అయినా ఆ చాన్స్‌ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌ రెడ్డికి చేవెళ్ల లోక్‌ సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌ కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నది టీఆర్ ఎస్‌ వర్గాల నుంచి అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని కార్తీక్‌ రెడ్డి ఆశించినా పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో అది సాధ్యపడలేదు. చెవేళ్ల లోక్‌ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికే అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సబితారెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరడం కూడా దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. వీరిద్దరే కాకుండా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య - పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు - పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ రెడ్డి - నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ కూడా టీఆర్ ఎస్‌ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.