Begin typing your search above and press return to search.

ఆరుగురు క్రికెటర్లకు అదిరే గిఫ్టు ప్రకటించిన ఆనంద్ మహీంద్ర

By:  Tupaki Desk   |   24 Jan 2021 4:18 AM GMT
ఆరుగురు క్రికెటర్లకు అదిరే గిఫ్టు ప్రకటించిన ఆనంద్ మహీంద్ర
X
దేశంలో పారిశ్రామిక దిగ్గజాలకు కొదవ లేకున్నా.. మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర మాదిరి సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం.. సమకాలీన అంశాలపై తక్షణం స్పందించటం ఆయన ప్రత్యేకత. సాధారణంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారంటే.. ఏదో వివాదంలో ఎప్పుడో ఒకప్పుడు పడటం ఖాయం. అందుకు భిన్నంగా ఎప్పుడూ.. ఎలాంటి వివాదంలోకి చిక్కుకోకుండా ఉండటంలో ఆయన తర్వాతే ఎవరైనా.

ట్వీట్లతోనే కాదు.. అప్పుడప్పుడు ఖరీదైన బహుమతులతోనూ ఆయన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొత్త టాలెంట్ ను బయటకు తెచ్చే విషయంలోనూ ఆయనకు ఆయనే సాటి. తన వరకు వచ్చిన ఏ కొత్త విషయాన్నివదలకుండా అందరితోనూ పంచుతుంటారు. కొత్త స్ఫూర్తిని నింపుతుంటారు. అలాంటి ఆనంద్ మహీంద్రా తాజాగా టీమిండియాలోని ఆరుగురు క్రికెటర్లకు అదరిపోయే బహుమతిని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్ ను సొంతం చేసుకోవటంలో కీలకంగా వ్యవహరించిన ఆరుగురు క్రికెటర్లకు తమ కంపెనీకి చెందిన సరికొత్త ఎస్ యూవీ థార్ ను బహుమతిగా ప్రకటించారు. టెస్టు సిరీస్ ను భారత జట్టు గెలుచుకోవటంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్.. వాషింగ్టన్ సుందర్.. నటరాజన్.. శుభమన్ గిల్.. నవ్ దీప్ సైనీ.. శార్దూల్ ఠాకూర్ లకు ఈ ఖరీదైన కారును బహుమతిగా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ బహుమతి యువ క్రికెటర్లకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.