Begin typing your search above and press return to search.

చిన్నారుల‌కు బంధ విముక్తి..ఆరుగురికి విముక్తి

By:  Tupaki Desk   |   8 July 2018 4:49 PM GMT
చిన్నారుల‌కు బంధ విముక్తి..ఆరుగురికి విముక్తి
X

థాయ్‌ లాండ్‌ లోని ఓ గుహలోకి వెళ్లి చిక్కుకున్న 12 మంది చిన్నారుల ఎపిసోడ్ లో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఆరుగురిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. రెండు వారాల కిత్రం కోచ్ తోపాటు 12 మంది చిన్నారులు గుహలోకి వెళ్లిన తర్వాత భారీగా వరదలు రావడంతో వాళ్లు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 9 రోజుల తర్వాత వాళ్లను ఇద్దరు బ్రిటిష్ డైవర్లు కనుగొన్నారు. ఇప్పుడు వాళ్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 13 మంది విదేశీ - ఐదుగురు స్వదేశీ డైవర్లతో కూడిన రెస్క్యూ టీం ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆరుగురు బాలలను హెలికాప్టర్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఆరుగురిని వెంటనే అంబులెన్స్ లలో చియాంగ్ రాయ్ సిటీలోని ఆస్పత్రికి తరలించామని అక్కడి ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్ర‌పంచం చూపును త‌న‌వైపు తిప్పుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే...11 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న 12 మంది పిల్లలు 25 ఏళ్ల వయసున్న వాళ్ల కోచ్‌ తో కలిసి వెళ్లారు. జూన్ 23 నుంచి కనిపించకుండా పోయారు. వారు గుహ‌ను సంద‌ర్శించేందుకు వెళ్లార‌ని తేలింది. అయితే, వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉన్న సమయంలో వాళ్లు ఆ గుహలోకి వెళ్లారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దీంతో బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది. అప్పటికే వాళ్లు 4 కిలోమీటర్ల మేర లోనికి వెళ్లిపోయారు. అక్కడక్కడా బయటపడటానికి కొన్ని మార్గాలు ఉన్నా.. వరద కారణంగా అవన్నీ బురదతో కూరుకుపోయాయి. పట్టాయా బీచ్ సమీపంలో వాళ్లు ఉండొచ్చని భావించిన డైవర్లు.. అక్కడి నుంచి లోనికి వెళ్లారు. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తే వాళ్లను ఇప్పటికిప్పుడు సురక్షితంగా బయటకు తీసుకురావడం అసాధ్యంగా మారింది. ప్రతి ఏటా ఆ గుహ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. అంతలోపు వాళ్లను బయటకు తీసుకురావాలంటే వాళ్లందరికీ కచ్చితంగా ఈత వచ్చి ఉండాలి. అయితే బురదతో కూడిన ఆ వరదలో ఓ మోస్తరు ఈత వచ్చిన వాళ్లను కూడా బయటకు తీసుకురావడం చాలా క‌ష్ట‌సాధ్యంగా మారింది.

ఆ చిన్నారులెవరికీ ఈత రాకపోవడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత క్లిష్టంగా మారింది. అయితే కొన్ని రోజులుగా వాతావరణం చక్కబడటం - గుహలో నీటి మట్టం తగ్గడంతో రెస్క్యూ ఆపరేషన్‌ ను విజయవంతం చేస్తామన్న నమ్మకం ఉందని గవర్నర్ చెప్పారు. ఈ ఆపరేషన్ మొదలుపెట్టే ముందు గుహ దగ్గరకి వచ్చిన మీడియాను అక్కడి నుంచి పంపించేశారు. జూన్ 23న ఈ గుహలోకి వెళ్లిన ఈ 13 మంది నాలుగు కిలోమీటర్ల లోపల చిక్కుకుపోయారు. అందరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి కొన్ని రోజుల సమయం పట్టొచ్చని భావించారు. ఆ చిన్నారుల రెస్క్యూ ఆపరేషన్‌ లో భాగంగా వచ్చిన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు సోమవారం రాత్రి వాళ్లను ఆ గుహలో గుర్తించారు. వాళ్లు తీసిన వీడియోను థాయ్ నేవీ సీల్ స్పెషల్ ఫోర్సెస్ ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేసింది. వరద నీటికి దూరంగా గుహలో ఉన్న ఓ ఎత్తయిన ప్రాంతంలో ఆ చిన్నారులు కూర్చున్నారు. మీరు కొన్నాళ్లు ఇక్కడే ఉండాలని, తాము తిరిగి వస్తామని వాళ్లు చెప్పడం వీడియోలో కనిపించింది. వాళ్లసలు బతికే ఉన్నారా లేదా అన్న అనుమానాలు కూడా కలిగాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ చిన్నారుల తల్లిదండ్రులు ఆనందంతో ఎగిరి గంతేశారు. 12 రోజులుగా వీళ్ల రెస్క్యూ ఆపరేషన్‌ను ఆ దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసింది.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌ లో 13 మంది విదేశీ - ఐదుగురు స్వదేశీ డైవర్లు పాలుపంచుకుంటున్నారని చియాంగ్ రాయ్ గవర్నర్ నరోంగ్‌ సాక్ వెల్లడించారు. ఒక్కో చిన్నారి వెనుక ఇద్దరు డైవర్లు ఉంటారని ఆయన చెప్పారు. అయితే, ఆప‌రేష‌న్ కీల‌క ఘ‌ట్టానికి చేరిన‌ స‌మ‌యంలో ఆ గుహ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. పైగా చిమ్మచీకటి. ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోయింది. నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పనిగా మారింది. మ‌రోవైపు శుక్రవారం ఈ గుహలోకి వెళ్లిన థాయ్ మాజీ నేవీ సీల్ అధికారి చనిపోయారు. అయిన‌ప్ప‌టికీ ఆదివారం ఉదయం పది గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఓ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి కనీసం 11 గంటలు పట్టింది. 13 మంది విదేశీ - ఐదుగురు స్వదేశీ డైవర్లతో కూడిన రెస్క్యూ టీం ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆరుగురు బాలలను హెలికాప్టర్ సాయంతో బయటకు తీసుకొచ్చి వెంటనే అంబులెన్స్‌ లలో ఆస్పత్రికి తరలించారు.