Begin typing your search above and press return to search.

రాయలసీమలో నయీం రగడ

By:  Tupaki Desk   |   17 Aug 2016 11:21 AM GMT
రాయలసీమలో నయీం రగడ
X
తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషన్ గా మారిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ - ఆ తరువాత పరిణామాలు ఇప్పుడు రాయలసీమలోనూ రచ్చ చేస్తున్నాయి. పోలీసు అధికారులు - రాజకీయ నేతలకు నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఈ వివాదం రాయలసీమకూ పాకింది. ఇప్పటికే తెలంగాణలో మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డిపై ఆరోపణలు రాగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాజాగా మరో పోలీసు అధికారి తనపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ఈ ఆరోపణల వెనుక రాయలసీమ నేత ఒకరు ఉన్నారని ఆయన ప్రత్యారోపణలు చేశారు. గ్యాంగ్‌ స్టర్ నయీంతో సంబంధాలున్న వ్యక్తుల్లో తాను కూడా ఉన్నానంటూ ఒక మీడియా చానల్‌ కథనం ప్రసారం చేయడంపై రిటైర్డ్ పోలీస్ అధికారి శివానందరెడ్డి స్పందించారు.

ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన మీడియాకు సూచించడంతో పాటు ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. మిగతా మీడియా అంతా ఏమీ అనకపోయినా ఒక ఛానల్‌ మాత్రమే తన పేరు ప్రస్తావించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ తప్పుడు కథనాల ప్రసారం వెనుక రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హస్తముండవచ్చని శివానందరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి కాంగ్రెస్‌ లో ఉండేవారని… నందికొట్కూరు ప్రాంతానికే చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో రాజకీయ విబేధాలున్నాయని దాన్ని మనసులో పెట్టుకుని సదరు చానల్‌ కు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డే తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు శివానందరెడ్డి.

తాను 2009లోనే రిటైర్ అయ్యానని అప్పటికి నయీం గురించి ఎవరకీ పెద్దగా తెలియదన్నారు. నల్లగొండలో తాను అదనపు ఎస్పీగా పనిచేసినప్పటికీ తాను ఆపరేషన్‌ చూసే వాడిని కాదని కేవలం పరిపాలన విభాగాన్ని పర్యవేక్షించేవాడినని చెప్పారు. అసలు నయీం గురించి తనకు తెలియదన్నారు. నయీంతో సంబంధం లేని వారి పేర్లు ప్రచారం చేయడం వల్ల… భవిష్యత్తులో అసలు నిందితుల పేర్లు బయటపెట్టినా జనం నమ్మే పరిస్థితి ఉండదన్నారు. పక్కా సమాచారం ఉంటే కథనాలు రాసుకోవాలే కానీ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే నమ్మకం కోల్పోతారని మీడియాకు ఆయన చురకలేశారు.