Begin typing your search above and press return to search.

కోరి మరీ బదిలీ పోటు పొడిపించుకున్నారా?

By:  Tupaki Desk   |   2 Sep 2016 6:51 AM GMT
కోరి మరీ బదిలీ పోటు పొడిపించుకున్నారా?
X
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనా పరంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఏ నిర్ణయం మీద జరగనంత చర్చ తాజాగా జరగుతోంది. తాజాగా చేసిన ఐపీఎస్ అధికారుల బదిలీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తిరుగులేని శక్తిగా మారటానికి ఓటుకు నోటు కేసు యవ్వారమని చెప్పక తప్పదు. ఈ ఇష్యూలో కేసీఆర్ నడిపినట్లుగా చెప్పే మాటలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారటమే కాదు.. కేసీఆర్ తో పెట్టుకుంటే సిరిగిపోతుందన్న భావన కలిగేలా చేసిందని చెప్పొచ్చు. అలాంటి పేరు ప్రఖ్యాతులకు కారణంగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి కీలకపాత్రే. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన్ను ఏరికోరి తెచ్చుకున్న కేసీఆర్ నమ్మకాన్ని ఆయన ఏ దశలోనూ వమ్ము చేయలేదు.

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న శివధర్ రెడ్డిని పట్టుపట్టి మరీ తెలంగాణకు తీసుకొచ్చిన కేసీఆర్.. ఆయనకు ఎంతో కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా చెబుతారు. అందుకు తగ్గట్లే తన పని తీరుతో కేసీఆర్ కు ఎన్నో ఘనతల్ని కట్టబెట్టారు. ఓటుకు నోటు వ్యవహారం కావొచ్చు.. తాజాగా గ్యాంగ్ స్టర్ నయిం ఎన్ కౌంటర్ కావొచ్చు. ఏ విషయంలోనూ ఆయన పనితీరును వేలెత్తి చూపించలేని పరిస్థితి. అలాంటి ఆయనపై బదిలీ వేటు వేయటం.. అప్రాధాన్యత పోస్ట్ కు పరిమితం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ సీఎం అయ్యాక.. పలువురు అధికారుల్ని బదిలీ చేసినా జరగని చర్చ తాజాగా శివధర్ రెడ్డి ట్రాన్స్ ఫర్ సందర్భంగా జరుగుతుందటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తాజా బదిలీ వెనుక ఏం జరిగిందన్న చర్చ సాగుతున్న వేళ.. ఆసక్తికర కోణం ఒకటి బయటకు వచ్చింది. నమ్మశక్యం కాని ఈ కోణంలోకి వెళితే.. విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్న శివధర్ రెడ్డి తనను తప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా కోరారని.. ఆయన మాటను కాదనలేకనే ముఖ్యమంత్రి తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

లాజిక్కుగా చూస్తే.. ఈ వాదనలో పస లేదనిపించక మానదు. ఎందుకంటే.. సమర్థుడైన అధికారి ఎవరూ.. పనిలో అలిసిపోవటం అనేది ఉండదు. తనకు కీలక పదవిని అప్పజెబితే.. ఒళ్లు చించుకొని పని చేస్తారే తప్పించి.. విశ్రాంతి తీసుకోవాలని అనుకోరు. సమర్ధులైన అధికారుల పని తీరు అలా ఉండనే ఉండదు. వారిని అప్రాధాన్యత పోస్ట్ లకు పెట్టినా.. అక్కడ కూడా సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. అందుకు భిన్నమైన వాదన తెర మీదకు రావటం గమనార్హం. అయినా.. ఎవరు మాత్రం తమకుతాముగా బదిలీ పోటు పడిపించుకోవటానికి ఇష్టపడతారు. కీలకమైన స్థానంలో ఉన్న వారు తమను ఏ మాత్రం గుర్తింపు లేని పోస్టింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుకుంటారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. శివధర్ రెడ్డి బదిలీ వ్యూహాత్మకమా? కీసీఆర్ తప్పిదమా? కావాలని చేసిందా? లాంటి విషయాలు బయటకు రావాల్సి ఉంది.