Begin typing your search above and press return to search.

గుంటూరులో టీడీపీ, బీజేపీ బిగ్ ఫైట్

By:  Tupaki Desk   |   20 July 2016 7:11 AM GMT
గుంటూరులో టీడీపీ, బీజేపీ బిగ్ ఫైట్
X
మిత్రపక్షాలు బీజేపీ - టీడీపీలు పార్లమెంటు ప్రత్యేకహోదా ప్రయివేటు బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో జాతీయ స్థాయిలో గొడవ పడుతుంటే.. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో గుంటూరులోనూ బీజేపీ - టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. గుంటూరు అర్బన్ బ్యాంకు ఛైర్మన్ పదవి కోసం రెండు పార్టీల నేతలు వాదులాటకు దిగారు. అర్బన్ బ్యాంకు వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు.

గుంటూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి ఏపీలోని అధికార మిత్రపక్షాలు టీడీపీ - బీజేపీల మధ్య వేడి పెంచింది. ఇప్పటికే పలు విషయాల్లో వాదనలకు దిగిన ఈ రెండు పార్టీలు గుంటూరు అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి కోసం తాజాగా ఘర్షణకు దిగాయి. ఈ రోజు ఉదయం గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్న బ్యాంకు కార్యాలయం వద్దకు ఇరు పార్టీల నేతలు వేర్వేరుగా చేరుకున్నారు. చైర్మన్ పదవి కోసం ఇరు పార్టీలు వేర్వేరుగా నామినేషన్ల దాఖలుకు సిద్ధపడ్డాయి. ఈ సందర్భంగా అక్కడ రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్న రెండు పార్టీల నేతలు ఆ తర్వాత ఒకరినొకరు తోసుకున్నారు. వెరసి రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నేత కన్నా మద్దతుతో తిరిగి నామినేషన్ వేసేందుకు ప్రస్తుత ఛైర్మన్ కొత్తమాకు శ్రీనివాసరావు యత్నించారు. అయితే... అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదటినుంచి టీడీపీతో ఢీ అంటే ఢీ అంటున్న కన్నా ఎలాగైనా తన అనుచరుడిని ఛైర్మన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మిత్రపక్షం బీజేపీలో చేరిన కన్నా మాట ఎలా నెగ్గనిస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో ఇది రెండు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది.