Begin typing your search above and press return to search.

ప్రాణాలకు తెగించి వెళ్ళిపోతున్న కాశ్మీర్ పండిట్లు

By:  Tupaki Desk   |   5 Jun 2022 4:21 AM GMT
ప్రాణాలకు తెగించి వెళ్ళిపోతున్న కాశ్మీర్ పండిట్లు
X
కాశ్మీర్ పండిట్ల హత్యలను అడ్డుకోవటం కేంద్రప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడులను తట్టుకోలేక లక్షలాదిమంది కాశ్మీరీ పండిట్లు తమ రాష్ట్రాన్ని వదిలేసి దేశంలేని ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయారు. తమ ఇళ్ళు, స్ధలాలు, ఇతర ఆస్తులను కూడా వదిలేసుకుని ప్రాణభయంతో వెళ్ళిపోయారు. అలాంటివారిని గుర్తించి వారందరినీ మళ్ళీ కాశ్మీర్ కు తిరిగి వచ్చేట్లు కేంద్రం ఒప్పించింది.

నరేంద్రమోడి సర్కార్ మీద నమ్మకంతో పండిట్లు, హిందువుల్లో చాలామంది కాశ్మీర్ కు వచ్చారు. అయితే వీరంతా ఎప్పుడైతే తమ సొంత ఊర్లకు తిరిగివచ్చారో వెంటనే హత్యలు మళ్ళీ మొదలయ్యాయి. గడచిన నెలరోజుల్లోనే సుమారు 10 మంది పండిట్లు, హిందువులను తీవ్రవాదులు వెతికి వెతికి మరీ కాల్చి చంపేస్తున్నారు. దాంతో కాశ్మీర్ లోయలో పండిట్లు, హిందువుల గోల మొదలుపెట్టారు. అయితే వీళ్ళెంత గోల చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.

దాంతో మోడి సర్కార్ ను నమ్ముకుంటే లాభంలేదని అర్ధమైపోయి చాలామంది సొంతంగానే కాశ్మీర్ లోయలో నుండి జమ్మూ ప్రాంతానికి వలసలు వెళ్ళిపోతున్నారు. మోడి సర్కార్ ఎంత ఆపాలని ప్రయత్నించినా వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఇక లాభంలేదని అమిత్ షా నేతృత్వంలో అత్యున్నత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాశ్మీర్ లోయలో పనిచేస్తున్న పండిట్లు, హిందువులందరినీ జమ్మూకు బదిలిచేయాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగానే శనివారం 180 మంది టీచర్లను జమ్మూకు బదిలీచేశారు.

బదిలీ ఉత్తర్వులు అందుకున్న వారు కాకుండా ఇంకా సుమారు 6 వేలమంది పండిట్లు, హిందువులు అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. మరి వీరి విషయం ఏమిటనేది ఇంకా తేలలేదు. బదిలీలు టీచర్లకేనా లేకపోతే అన్నీ శాఖల్లోని వాళ్ళకూ వర్తిస్తుందా అన్న విషయాన్ని కేంద్రం తేల్చలేదు. దాంతో తమ శిబిరాల్లో నుండి పండిట్లు, హిందువులు ఏదో పద్దతిలో బయటకు వచ్చేసి జమ్మూకి వెళ్ళిపోతున్నారు. కాశ్మీర్ లోయలోని అనంతనాగ్, బారాముల్లా, కుల్లాం, బుడ్డాం, గుండేల్బాగ్, కుప్వారా ప్రాంతాల్లో అనేక శాఖల్లో పనిచేస్తున్నారు. పై ప్రాంతాల్లో తీవ్రవాదుల దాడులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే పండిట్లు, హిందువులు ప్రాణాలకు తెగించి వెళ్ళిపోతున్నారు.