Begin typing your search above and press return to search.

కిడ్నీలు అమ్మి.. పిల్లల ఆకలి తీరుస్తున్నారు..!

By:  Tupaki Desk   |   2 March 2022 3:30 AM GMT
కిడ్నీలు అమ్మి.. పిల్లల ఆకలి తీరుస్తున్నారు..!
X
పాలుగారే పసి వయసు వారిది. అమ్మానాన్నల ముద్దులతో పాటు పౌష్టికాహారంతో పెరగాల్సిన పిల్లలు వాళ్లు. కానీ ఆకలితో అలమటిస్తున్నారు. కడుపున పుట్టిన పిల్లలకు కాసింత తిండి పెట్టలేని దీన స్థితిలో అక్కడి తల్లిదండ్రులు ఉన్నారు.

రెక్కలు ముక్కలుగా చేసి కష్టపడి పని చేద్దామనుకున్నా వారికి పని దొరకడం లేదు. పైసా పుట్టడం లేదు. కటిక పేదరికం గురించి ఆ తల్లిదండ్రులకు తెలుసు కానీ కానీ అభంశుభం తెలియని ఆ చిన్నారులకు తెలియదు కదా. ఆ పిల్లల పొట్ట నింపేందుకు తల్లిదండ్రులు తమ శరీర అవయవాలను సైతం బేరం పెడుతున్నారు. ఈ దీన స్థితి తాలిబన్ల వశమైన అప్గానిస్తాన్ లో చోటు చేసుకుంది.

తాలిబన్ల వశమైన అప్గానిస్తాన్ లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గత ఏడాది తీవ్ర పోరు తర్వాత ఆ దేశం తాలిబన్ల చేతులకు చిక్కింది. అంతా వారిదే సామ్రాజ్యంగా మారింది. అయితే తాలిబన్ల పాలనలో విద్య, ఉపాధి అవకాశాలు పూర్తిగా స్తంభించాయి. నిరుద్యోగం పెరిగింది. ఎవరికీ పని దొరకడం లేదు.

ఈ నేపథ్యంలో ఆకలి కేకలు పెరిగాయి. ఆకలితో అలమటించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే ఓ గ్రామంలో పిల్లలకు తిండి పెట్టడం కోసం ఏకంగా కిడ్నీనే బేరం పెడుతున్నారు తల్లిదండ్రులు.

పిల్లల ఆకలి బాధను తీర్చడానికి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కిడ్నీని అమ్ముతున్నారు. తాము ఉన్నంతవరకు తమ కుటుంబాన్ని కాపాడుకుంటామని అంటున్నారు. అందుకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదని కంటతడి పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులుగా పిల్లల ఆకలి తీర్చాల్సిన బాధ్యత తమదేనని... అందుకే ఇలా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ ప్రాణం పోయేంత వరకు ఎలాగైనా చేసి.. పిల్లల కడుపు నింపుతామని ఉద్వేగభరితం అవుతున్నారు.

ఈ ఆకలి కేకలతో కిడ్నీలు అమ్మే వారి సంఖ్య ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు. వేలకు చేరింది. అఫ్గానిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో ఈ కరవు వచ్చింది. హెరాత్ నగరం సమీపంలోని ఓ గ్రామంలో అందరూ కిడ్నీ విక్రయించారు. ఆ ఊరికి ఏకంగా వన్ కిడ్నీ విలేజ్ అనే పేరు కూడా వచ్చిందంటే... పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశంలో సుమారు 38 బిలియన్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.