Begin typing your search above and press return to search.

పెద్దన్న పాత్ర పోషిస్తామంటే ఛీ పొమ్మన్నారు

By:  Tupaki Desk   |   26 Dec 2016 2:40 PM GMT
పెద్దన్న పాత్ర పోషిస్తామంటే ఛీ పొమ్మన్నారు
X
తొందరపాటు అంత మంచిది కాదు. అందులోకి బలమైన.. తెలివైన ప్రత్యర్థి ఉన్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. తొందరపాటుతో దూకుడు నిర్ణయాలు తీసుకుంటే ఎదురుదెబ్బలు తప్పవు. తాజాగా అలాంటి పరిస్థితే కాంగ్రెస్ కు ఎదురైంది. సరైన నాయకత్వం లేకుండా.. ఎలాంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లేకుండా గుడ్డి నమ్మకమో.. మితిమీరిన ఆత్మవిశ్వాసమో కానీ.. కాంగ్రెస్ కు భారీ దెబ్బ తగిలింది.

పెద్దనోట్ల రద్దుపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై విపక్షాల్ని ఏకతాటి మీద నడిపించాలని.. అందరికి నాయకత్వం వహించాలని.. పెద్దన్న పాత్రను పోషించాలని భావించిన కాంగ్రెస్ కు కరెంటు షాకిచ్చాయి. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నపార్టీలతో కలిపి.. ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టాలని కాంగ్రెస్ భావించింది. దీనికి రాజకీయ పక్షాలు నో చెప్పాయి. విపక్షాలతో కలిసి బలప్రదర్శన చేయటంతో పాటు.. రింగ్ మాష్టర్ అన్న భావన కలిగేలా చేయాలన్న కాంగ్రెస్ కు జెల్లకాయ కొట్టినట్లుగా విపక్షాలు నోరు పారేసుకోవటం గమనార్హం.

తాము వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించటం తమ ఉద్దేశం కాదని.. అయినా ఇలాంటి విషయాల్లో పార్లమెంటులో ఒక్కతాటిపై నిలిచినంత తేలిగ్గా.. బయట వేదికల మీద కలవటం అంత సులువైన పని కాదని సీపీఎం నేత సీతారాం ఏచూరి తేల్చేశారు. అంతేకాదు.. విపక్షాలన్నీ ఏకం కావాలంటే ముందస్తుగా సంప్రదింపులు జరపాలంటూ చెప్పటం ద్వారా.. కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ ఎంత వీక్ అన్నది ఇట్టే అర్థమవుతుంది. సీపీఎం మాదిరే జేడీయూ.. ఎన్సీపీలు కూడా ఇదే తరహా వాణిని వినిపించటం గమనార్హం. పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేయాలన్న విషయాన్ని కాంగ్రెస్ వ్యూహకర్తలు ఎందుకు మిస్ అవుతున్నట్లు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/