Begin typing your search above and press return to search.

ఆ ఎంపీ ఇచ్చిన నోటు ఎవరూ తీసుకోవడం లేదట..

By:  Tupaki Desk   |   16 Nov 2016 10:35 AM GMT
ఆ ఎంపీ ఇచ్చిన నోటు ఎవరూ తీసుకోవడం లేదట..
X
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం 'పెద్దల'ను కూడా చాలా ఇబ్బందులు పెడుతోంది. రాజ్యసభ ఎంపీలు కొందరు ఈ రోజు సమావేశాల్లో మాట్లాడుతూ తాము పడుతున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి తాను పార్లమెంటు ప్రాంగణంలోని బ్యాంకు నుంచే తీసుకున్న రూ.2 వేల నోటును ఇప్పటివరకు మార్చుకోలేకపోయానని... 9వ తేదీ నుంచి దాన్ని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ తీసుకోవడం లేదని చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. చాలామంది తమదీ అదే పరిస్థితని చెప్పుకొచ్చారు.

ఏచూరి.. తన జేబులోంచి ఓ రెండు వేల రూపాయల కాగితాన్ని బయటకు తీసి చూపిస్తూ... "ఇది 9వ తారీఖు నుంచి నా దగ్గరే ఉంది. ఎవరూ తీసుకోవట్లేదు. పార్లమెంటులోని మన బ్యాంకు నుంచే తీసుకున్నా. ఇక్కడెక్కడా తీసుకోవట్లేదు" అని చెప్పారు. తానేం చేయాలో చెప్పాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ను ప్రశ్నించారు. ఆపై సమాజ్ వాది పార్టీ ఎంపీ రాంగోపాల్ మాట్లాడుతూ, ఎంపీల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న సమస్యని, దీన్ని ముందుగా మోదీ సర్కారు గుర్తించలేకపోయిందని ఆరోపించారు.

ప్రధాని మోడీ తల్లి కూడా నోట్ల రద్దు ప్రభావం వల్ల ఇబ్బందులు పడ్డారని.. మోడీ తల్లి 90 ఏళ్ల వయసులో లైన్లో నుంచి డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందని.. ఆమె పడిన బాధే దేశంలోని ప్రతి తల్లి అనుభవిస్తోందని రాంగోపాల్ యాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఒక జీవిత కాలం పాటు తాను దాచుకున్న డబ్బులను మార్చుకునేందుకు ప్రధాని తల్లి బ్యాంకుకు వెళ్లారని, అలాగే ప్రతి తల్లి బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారని ఆయన చెప్పారు. జీవిత కాలం పైసాపైసా జమచేస్తే... ఆ డబ్బులు లాగేసుకుంటామని కేంద్రం చెప్పడం ఎంతవరకు న్యాయమని ఆయన నిలదీశారు. ప్రజలు ఇంతే ఉంచుకోవాలి, ఇంతకంటే ఎక్కువ ఉంచుకుంటే లాగేసుకుంటామని చెప్పడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.దేశంలో అత్యధిక శాతం తమను సమర్థిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారని, సోషల్ మీడియాను చూసి భ్రమల్లో బతకొద్దని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో రోటీ కర్రతో వీపు వాచిపోయే సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. యూపీలో బంగాళాదుంపల పంట చేతికందే సమయమని, కేంద్రం నిర్ణయంతో ఆ పంటను కొనేవారే లేకుండా పోయారని ఆయన తెలిపారు. పంటకోసం పొలంలో పని చెయ్యాల్సిన గ్రామీణ ప్రజలు బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిల్చుని పడిగాపులు కాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/