Begin typing your search above and press return to search.

బీజేపీపై ఏచూరి..ఓ రేంజిలో ఫైరయ్యారు!

By:  Tupaki Desk   |   27 Dec 2019 5:54 PM GMT
బీజేపీపై ఏచూరి..ఓ రేంజిలో ఫైరయ్యారు!
X
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా... పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఈ రెండింటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా ప్రతి విషయంపైనా రియాక్ట్ అయ్యే ఉస్మానియా విద్యార్థులు... సీఏఏ - ఎన్నార్సీలపైనా తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ధర్నాలు - రాస్తా రోకో లకు బదులుగా ఈ దఫా సీఏఏ - ఎన్నార్సీలపై సదస్సులు - చర్చాగోష్టీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉస్మానియా విద్యార్థులు నిర్వహించిన సేవ్ ఇండియా సెమినార్ కు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి పైనా - ప్రత్యేకించి...ఎన్డీఏ సర్కారును నడిపిస్తున్న బీజేపీపై ఆయన తనదైన శైలి విమర్శలు చేశారు.

దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని - ఈ తరహా యత్నాలు..., ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ ను నవ్వుల పాలు చేస్తాయని ఏచూరి చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం - జాతీయ పౌర నమోదు కార్యక్రమాలు రాజ్యాంగ విరుద్దమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకంటే గొప్ప దేశభక్తులు లేరని చెప్పుకుంటోన్న బీజేపీ నాయకులు.. రాజ్యాంగ వ్యవస్థను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించడం దేశభక్తి అనిపించుకోదని ఏచూరి ఎద్దేవా చేశారు. దేశంలో మతోన్మాద రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. జాతీయ సౌర నమోదు పేరుతో ప్రజలను మతోన్మాదం వైపు ఆకర్షితులను చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఏచూరి ఆరోపించారు. లౌకికవాద దేశంగా ప్రపంచదేశాల్లో గుర్తింపు పొందిన భారత్ ను క్రమంగా హిందుత్వ దేశంగా మార్చడానికి చాప కింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయని... వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు.

బీజేపీ చర్యలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్‌) మద్దతు ఇస్తోందని ఏచూరి మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యవస్తమైన విషయాన్ని పక్కదారి పట్టించడానికి మోదీ సర్కారు అనేక కుట్రలు, మోసాలకు తెర తీసిందని అన్నారు. తనదైన మార్కు రాజకీయంతో దేశ ప్రజల దృష్టిని బీజేపీ మరల్చిందని - పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు కార్యక్రమాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. ఈ తరహా కుట్రలను ఆదిలోనే వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఏచూరి విద్యార్థులకు పిలుపునిచ్చారు. మొత్తంగా సీఏఏ, ఎన్నార్సీలను అడ్డుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదేనని చెప్పిన ఏచూరి... ఈ రెండింటి వెనుక బీజేపీ కుట్రలను తనదైన శైలిలో బయటపెట్టేశారు.