Begin typing your search above and press return to search.

న‌మ్మ‌కం లేదు: బాబుపై ఏచూరి కామెంట్స్‌

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:53 PM GMT
న‌మ్మ‌కం లేదు: బాబుపై ఏచూరి కామెంట్స్‌
X
రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందా? సీఎం చంద్ర‌బాబు మాట‌ల‌ను ఏ ఒక్క‌రూ విశ్వ‌సించ‌లేక పోతున్నారా? ఆయ‌న అన్నీ త‌ప్పుడు హామీల‌తో కాలం నెట్టుకొస్తున్నారా? అంటే.. సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి స్ప‌ష్టంగా `ఔన‌నే` అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, పోలవ‌రం ప్రాజెక్ట్‌, రాజధాని నిర్మాణం పూర్తి అవుతాయనే నమ్మకం లేదన్నారు. తప్పుడు హామీలతో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రానున్న రోజుల్లో కూడా అధికారం తమదే అని చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదమని దుయ్య‌బ‌ట్టారు. బాబు వ్యాఖ్య‌లు న‌మ్మ‌శ‌క్యంగా లేవ‌న్నారు.

నిజానికి రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎప్ప‌టి నుంచో మొత్తుకుంటూనే ఉంది. అనేక స‌మ‌స్య‌లు పుట్టుకొస్తున్నాయ‌ని, కుల, మ‌త ప్రాంతాల వారీగా ప్ర‌జ‌లను టీడీపీ ప్ర‌భుత్వం విడ‌దీస్తోంద‌ని వైసీపీ నేత‌లు ఇటీవ‌ల భారీ ఎత్తున ఆరోపించారు. అయినా కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎక్క‌డా స్పందించ‌లేదు. పైగా వైసీపీ నేత‌ల‌పై ఎదురు దాడికి దిగి.. నానా ర‌కాలుగా తిట్టిపోసింది. అయితే, ఇప్పుడు ఏకంగా సీపీఎం జాతీయ కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న ఏచూరి.. ఇలా టీడీపీపై విరుచుకుప‌డ‌డం వాస్త‌వాల‌ను ప్ర‌తిబింబిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

వాస్త‌వానికి బాబు పాల‌న‌పై సీపీఎం పెద్ద‌గా స్పందించ‌దు. ఎందుకంటే.. గ‌తంలో టీడీపీ-వామ‌ప‌క్షాలు క‌లిసే ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి. 2014లో మాత్రమే బాబు బీజేపీతో బంధం పెంచుకున్నాడు. కానీ, ఇప్పుడు అదే సీపీఎం బాబుపై కారాలు-మిరియాలు నూరడం బాబు పాల‌న‌కు అద్దం ప‌ట్టింది. ఇటీవ‌ల కాలంలో బాబు ప‌రిస్థితిపై కేంద్రం కూడా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. తాము వివిధ ప‌థ‌కాల‌కు ఇస్తున్న నిధుల‌ను బాబు త‌న ఇష్టానుసారం ఖ‌ర్చు చేస్తున్నార‌ని, లెక్క‌లు సైతం చూపించ‌డం లేద‌ని కేంద్రం ప‌లుమార్లు ఆక్షేపించింది. ఇప్పుడు సీతారాం ఏచూరి వ్యాఖ్య‌ల్లోనూ అదే క‌నిపించింది. మ‌రి బాబు ఇప్ప‌టికైనా నిజాలు చెబుతారా?! చూడాలి.