Begin typing your search above and press return to search.

వెంకయ్య‌తో ఏచూరీ స్నేహం ఇంత స్ట్రాంగా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 8:53 AM GMT
వెంకయ్య‌తో ఏచూరీ స్నేహం ఇంత స్ట్రాంగా?
X
ఉప‌రాష్ట్రప‌తిగా ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు కాసేప‌టి క్రితం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నిన్న‌టిదాకా ఫ‌క్తు బీజేపీ నేత‌గా, ఆ పార్టీ తురుపు ముక్క‌గా కొన‌సాగిన వెంక‌య్యనాయుడు... రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మీద ఏ స్థాయిలో విరుచుకుప‌డ్డారో మ‌నంద‌రికీ తెలిసిందే. అస‌లు వెంక‌య్య‌ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు చేయాలంటే వైరి వ‌ర్గాల‌కు అంత‌గా ధైర్యం చాలేది కాద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఇక పార్ల‌మెంటులో వెంక‌య్య నోరు విప్పారంటే... అవ‌త‌లి ప‌క్షం చూస్తూ కూర్చోవ‌డం మిన‌హా చేయ‌గ‌లిగిందేమీ లేద‌న్న విష‌యం కూడా మ‌న‌కు తెలిసిందే. ఇక అధికారంలో ఏ పార్టీలో ఉన్నా... త‌మ‌ది మాత్రం ప్ర‌జా ప‌క్ష‌మేన‌ని చెప్పుకునే వామ‌ప‌క్షాల నేత‌లు, ప్ర‌త్యేకించి సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరీ విష‌యానికి వ‌స్తే... అవ‌త‌లి వైపున ఎవ‌రున్నా కూడా ఆయ‌న‌ను వారించ‌డం సాధ్య‌ప‌డే విష‌యం కానే కాదు. మ‌న్మోహ‌న్ సింగ్ అయినా, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అయినా... చివ‌ర‌కు వెంక‌య్య ఉన్నా కూడా ఏచూరీ వెన‌క‌డుగు వేసిన సంద‌ర్భాలే క‌నిపించ‌వు.

తెలుగు నేల‌కే చెందిన ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో భాగంగా రెండు వేర్వేరు పార్టీల్లో - వేర్వేరు భావ‌జాలాలతో ముందుకు సాగారు. మ‌రి నిత్యం రాజ‌కీయంగా పోరు సాగించే వీరిద్ద‌రి మ‌ధ్య ఏమాత్రం స్నేహం లేద‌నే మ‌నం అనుకుంటాం. కానీ... రాజ‌కీయంగా వారిద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు విభేదించినా... వ్య‌క్తిగ‌తంగా వారిద్ద‌రి మ‌ధ్య కించిత్ శ‌త్రుత్వం కూడా లేద‌ట‌. శ‌త్రుత్వ‌మ‌న్న మాట వారిద్ద‌రి మ‌ధ్య అస‌లు క‌నిపించ‌క‌పోగా... అస‌లు సిస‌లు స్నేహితులుగా వారు మెల‌గారన్న విష‌యం ఇప్పుడు పార్ల‌మెంటు సాక్షిగా వెలుగు చూసింది. భార‌త ఉప రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆయ‌న‌ను అభినందిస్తూ మాట్లాడిన ఏచూరీ... 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సిద్ధాంత పరంగా పోరాడాం - విభేదించాం - కలిసి పనిచేశాం - అనుభవాలు - అభిప్రాయాలు - ఆప్యాయతలు పంచుకున్నామని అన్నారు.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమ ఇద్దరినీ చూసి మీడియా ఒకసారి, సభలో అంత తీవ్రంగా వ్యతిరేకిస్తారు కదా... బయట ఇలా ఎలా ఉండగలుగుతున్నారని అడిగిందని గుర్తు చేసుకున్నారు. అప్పుడు వెంకయ్యనాయుడు వారికి సమాధానమిస్తూ, 'నేను ఒక రైలు ఎక్కాను. రైలులో ప్రవేశించిన తరువాత సీతారాం ఏచూరి కనిపించాడు. వెంటనే రైలు దిగెయ్యాలా? అని ఎదురు ప్రశ్నించారు' అనగానే... సభలోని వారంతా నవ్వేశారు. తమ సిద్ధాంతాలు - దారులు వేరైనా పని చేసింది మాత్రం ఒకే లక్ష్యం కోసం - ఒకే చోట అని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడుకి ఈ సందర్భంగా తాను గురజాడ మాటలు గుర్తు చేస్తున్నానని ఆయన చెప్పారు. దేశమంటే మట్టికాదోయ్ - దేశమంటే మనుషులోయ్ అన్నది ప్రతిక్షణం గుర్తుంచుకోవాలని సూచించారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రధానమైన స్థానంలో వెంకయ్యనాయుడు కూర్చుని ఉన్నారని, ఆయన నిష్పాక్షికమైన బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఏచూరీ ప్ర‌సంగం ప్రారంభిస్తున్న స‌మ‌యంలోనూ వెంక‌య్య వ్యాఖ్య‌ల‌తో స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. త‌న ప్రసంగాన్ని ఏచూరీ ఆంగ్లంలో ప్రారంభించ‌గా... తెలుగులో మాట్లాడండి అంటూ వెంక‌య్య కోరారు. అందుకు ఆప్ష‌న్ ఉందా? అన్న ఏచూరీ వ్యాఖ్య‌తోనూ స‌భ‌లో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది.