Begin typing your search above and press return to search.

ద్రౌపది ముర్ముకు ఓటేసిన సీతక్క.. కాంగ్రెస్ కు షాక్ లగా?

By:  Tupaki Desk   |   18 July 2022 8:30 AM GMT
ద్రౌపది ముర్ముకు ఓటేసిన సీతక్క.. కాంగ్రెస్ కు షాక్ లగా?
X
ఎరక్కపోయి ఇరుక్కుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అవగాహన లేకపోవడంతో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం చేసింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఓటేసింది. ఓ రకంగా కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చేసింది.

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీలు, పార్లమెంట్ లో పోలింగ్ జరుగుతోంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకూ 99 మంది సభ్యులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేశారు. బ్యాలెట్ పేపర్ తీసుకున్న సీతక్క.. కాంగ్రెస్ మద్దతు తెలిపిన యశ్వంత్ సిన్హాకు బదులుగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టుగా తెలుస్తోంది.

అయితే మరో బ్యాలెట్ పత్రం ఇవ్వాలని సీతక్క అడిగారు. పొరపాటుగా ఓటు పడిందని అధికారులకు చెప్పిన సీతక్క.. బ్యాలెట్ పేపర్ ను డ్రాప్ బాక్స్ లో వేయకుండా ఉండిపోయారు. తనకు మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని సీతక్క కోరడంతో ఆమె విజ్ఞప్తిని రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. అనంతరం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు సీతక్కకు చెప్పారు. దీంతో సీతక్క అసెంబ్లీ నుంచి వెనుదిరిగారు.

బయటకొచ్చిన సీతక్క మాత్రం తాను సరిగానే ఓటు వేశానని అంటున్నారు. తమ పార్టీ అనుకున్న యశ్వంత్ సిన్హాకే ఓటు వేశానని తెలిపారు. బ్యాలెట్ పేపర్ పై పెన్ మార్క్ పడడంతో చెల్లుబాటు అవుతుందో లేదో అనే అనుమానం ఉందన్నారు.

ఈరోజు సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. పార్లమెంట్ హౌస్ తోపాటు రాష్ట్రాల అసెంబ్లీలో పోలింగ్ కొనసాగుతుంది. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 21న జరుగుతుంది.

ఇప్పటివరకూ సమీకరణాలు పరిశీలిస్తే ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రపతిని దేశంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్నుకుంటారు. తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. మొత్తం 119 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 15708గా ఉంది.